కేంద్ర ప్రభుత్వంపై విజయ్‌మాల్యా సంచలన వ్యాఖ్యలు

భారత్‌లో బ్యాంకుల్ని ముంచేసి పరారైన విజయ్‌మాల్యా.. కేంద్ర ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్రిటన్‌కు వెళ్లిపోయేముందు తాను ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీని కలిసినట్లు తెలిపాడు. దేశం వదిలి వెళ్లిపోయే ముందు అన్ని సమస్యలు పరిష్కరించేందుకు ఆయన్ను చాలాసార్లు కలిసినట్లు చెప్పాడు.

విజయ్ మాల్యా ఆరోపణలపై అరుణ్ జైట్లీ ఘాటుగా స్పందించారు. మాల్యా తనను కలిసినట్లు చెప్పడం అత్యంత దారుణమన్నారు. మాల్యాను పార్లమెంటు కారిడార్లో ఓసారి కలిశానని.. తాను వ్యక్తిగతంగా ఆయన్ను కలవలేదని స్పష్టం చేశారు. పార్లమెంటు కారిడార్‌లో కూడా తాను బ్యాంకు రుణాల గురించి మాట్లాడలేదన్నారు. బ్యాంకు రుణాల సమస్యను ప్రస్తావించేందుకు మాల్యా ప్రయత్నించారని… అయితే బ్యాంకర్లతో మాట్లాడాలని మాత్రమే తాను చెప్పానన్నారు.

విజయ్‌మాల్యా వ్యాఖ్యలు భారత్‌లో దుమారం రేపడంతో.. ఆయన కొద్దిసేపటికే యూ టర్న్‌ తీసుకున్నాడు. జైట్లీని కలిసినట్లు చెప్పిన కొద్దిక్షణాల్లోనే మాట మార్చాడు. అరుణ్ జైట్లీతో వ్యక్తిగతంగా, అధికారికంగా ఎప్పుడూ సమావేశం కాలేదని స్పష్టం చేశాడు. మీడియా సెన్సేషనల్ స్టోరీస్ క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ వివాదాన్ని మీడియాయే సృష్టించిందన్నాడు విజయ్‌మాల్యా.

విజయ్‌మాల్యా తాజా వ్యాఖ్యలు దేశంలో రాజకీయ వేడిని పెంచుతున్నాయి. కాంగ్రెస్‌ సహా ప్రతిపక్షాలన్నీ ప్రభుత్వంపై విమర్శలు కురిపిస్తున్నాయి. ఆర్థిక నేరగాళ్లు దేశం విడిచి వెళ్లిపోయేందుకు బీజేపీనే అవకాశం కల్పిస్తోందని… ఇందుకు విజయ్‌మాల్యా వ్యాఖ్యలే నిదర్శనమని ఆరోపిస్తున్నాయి. మాల్యా దేశం విడిచి వెళ్లిపోయేందుకు ప్రభుత్వం ఎందుకు అవకాశం కల్పించిందో చెప్పాలని కాంగ్రెస్‌ నాయకులు డిమాండ్‌ చేశారు.

మరోవైపు విజయ్‌మాల్యా కేసుపై లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్‌ కోర్టులో విచారణ జరిగింది. మాల్యాను భారత్‌కు పంపించడంపై లండన్ కోర్టు డిసెంబరు 10న తీర్పు చెప్పే అవకాశముంది. భారత్‌లో బ్యాంకులకు 9,900 కోట్లు ఎగ్గొట్టిన మాల్యా… మాల్యా 2016 మార్చి 2న బ్రిటన్‌ పారిపోయాడు. ఆయన్ను తిరిగి స్వదేశానికి పంపించాలంటూ కేంద్రప్రభుత్వం లండన్‌ కోర్టులో కేసు దాఖలు చేసింది. అయితే భారత్‌లో జైళ్లు సరిగ్గా లేవని, గాలి వెలుతురు కూడా ఉండదని అప్పట్లో మాల్యా ఆరోపించారు. దీంతో మాల్యాను ఉంచే జైలు వీడియోను అధికారులు పంపించారు. నిన్నటి విచారణలో ఆ వీడియోను పరిశీలించిన న్యాయస్థానం… మాల్యాను భారత్‌ పంపించే విషయంపై డిసెంబర్‌ 10న తీర్పు ఇస్తామని తెలిపింది.