సప్తముఖ వినాయకుడిగా ఖైరతాబాద్‌ గణేష్‌

ఖైరతాబాద్ గణేషుడికి స్వామి పరిపూర్ణానంద తొలి పూజ చేసారు. మంత్రి తలసాని శ్రీనివాస్, బీజేపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి సహా పలువురు నేతలు కూడా వినాయకుడిని దర్శించుకున్నారు. ఏటా స్వామివారికి పద్మశాలీలు యజ్ఞోపవీతాన్ని సమర్పించినట్టే ఈసారి కూడా కానుక ఇచ్చారు. 57 అడుగుల లంబోదరుడిని చూసేందుకు భక్తులు కూడా పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

భాగ్యనగరంలో గణేష్ ఉత్సవాలు అంబరాన్ని అంటేలా జరుగుతున్నాయన్నారు మంత్రి తలసాని. 11 రోజులపాటు పూజలు చేశాక.. ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం ఉంటుందన్నారు.

ఈసారి ఖైరబాద్‌ వినాయకుడిని ‘శ్రీ సప్త ముఖ కాళసర్ప మహా గణపతి’గా తీర్చిదిద్దారు. 57 అడుగుల ఎత్తుతో ఏకదంతుడు చూడముచ్చటగా ఉన్నాడు. ఏడు తలలు, 14 చేతులు, తలపై ఏడు సర్పాలతో అలంకరణ చేశారు. విగ్రహం కుడి పక్కన మండపంలో శ్రీనివాస కళ్యాణ ఘట్టం, ఎడమవైపు శివపార్వతుల కుటుంబాన్ని తీర్చిదిద్దారు. ప్రస్తుతం రద్దీని దృష్టిలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేశారు.