తిరుమలలో వైభవంగా శ్రీవేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా మొదలయ్యాయి. ఇవాళ సాయంత్రం ధ్వజారోహణం జరగబోతోంది. ఆ తర్వాత నుంచి కొండపై వాహన సేవలు ప్రారంభం అవుతాయి. తిరుమాడ వీధుల్లో శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీమలయప్పస్వామి ముందుగా పెద్ద శేష వాహనంపై విహరించనున్నారు. అటు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కుటుంబ సమేతంగా ఇవాళ తిరుమల వెళ్తున్నారు. మధ్యాహ్నం కొండపైకి చేరుకున్నాక శ్రీపద్మావతి అతిథిగృహంలో బస చేస్తారు. సాయంత్రం శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. రాత్రికి ఆయన తిరుమలలోనే బస చేస్తారు. తిరుమల బ్రహ్మోత్సవాలు కావడంతో కొండపై భక్తుల రద్దీ క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం సర్వ దర్శనానికి 6 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది.

నిన్న సాయంత్రం వైఖానస ఆగమశాస్త్రాల ప్రకారం బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. శ్రీవారి సేనాధిపతి శ్రీవిష్వక్సేనుడు తిరువీధుల్లో ఊరేగుతూ పర్యవేక్షించారు. శంఖం, చక్రం, గధ, ఖడ్గం తదితర ఆయుధాలను ధరించిన సేనాధిపతి విష్వక్సేనుడు.. ఛత్ర, చామర, మంగళ వాయిద్యాలతో భేరినినాదాల నడుమ తిరుమాడ వీధుల్లో బంగారు తిరుచ్చి వాహనంపై ఊరేగారు. మాడవీధుల్లో సంప్రదాయబద్ధంగా సాగిన ఈ పూజా క్రతువును వీక్షించిన భక్తులు తన్మయత్వానికి లోనయ్యారు. అర్చకులు వసంత మండపంలో భూదేవికి పూజలు నిర్వహించి మట్టిని సేకరించారు. అనంతరం తిరువీధుల్లో ఊరేగుతూ ఆలయానికి చేరుకుని.. సేకరించిన మట్టిని నవపాలికల్లో నింపి నవధాన్యాలను అంకురింపచేశారు. బ్రహ్మోత్సవాలు జరిగినన్ని రోజులు యాగశాలలో యజ్ఞ క్రతువు కొనసాగనుంది.