విశాఖ రైల్వే జోన్‌ ఇస్తే అభ్యంతరం లేదు: ఒడిశా ఎంపీ

విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటులో ఆలస్యంపై టీడీపీ ఉత్తరాంధ్ర ఎంపీలు మండిపడ్డారు. హామీని నిలబెట్టుకోకపోతే ఏపీ ప్రజలకు బీజేపీకి బుద్ధి చెప్తారని హెచ్చరించారు. రైల్వే జీఎం ఆధ్వర్యంలో జరిగిన సమావేశం నుంచి టీడీపీ సభ్యులు వాకౌట్‌ చేసి నిరసన తెలిపారు.

విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు కోసం తెలుగుదేశం పార్టీ పోరాటం కొనసాగిస్తోంది. ఈస్ట్ కోస్ట్ రైల్వే జీఎం ఉమేష్ సింగ్ ఆధ్వర్యంలో విశాఖ డీఆర్‌ఎం కార్యాలయంలో జరిగిన కీలక సమావేశంలో టీడీపీ ఎంపీలు తమ నిరసన తెలిపారు. కేంద్రప్రభుత్వ తీరును నిరసిస్తూ సమావేశం నుంచి వాకౌట్‌ చేశారు.

విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌ ఇవ్వడానికి కేంద్రానికి ఒక రూపాయి కూడా అదనంగా ఖర్చు కాదని.. జోన్‌ ఏర్పాటుకు కావాల్సిన అన్ని సౌకర్యాలూ వాల్తేరు డివిజన్లో ఉన్నాయని టీడీపీ ఎంపీలు గుర్తు చేశారు. రైల్వేజోన్‌ హామీపై వెనకడుగు వేస్తే.. వచ్చే ఎన్నికల్లో ఏపీ ప్రజలు బీజేపీకి బుద్ధి చెప్తారని హెచ్చరించారు.

మరోవైపు విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌ ఏర్పాటు చేస్తే.. తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఒడిశా ఎంపీ భాస్కర్‌రావు తేల్చిచెప్పారు. రైల్వేజోన్‌ ఇచ్చే ప్రసక్తే లేదని రైల్వేమంత్రి పీయూష్ గోయల్‌ అన్నట్లు తెలిపారు. జోన్ ఇచ్చినట్లయితే.. వెస్ట్ బెంగాల్‌లో రౌల్ ఖెలా, భాలసూర్, రాయ్‌గఢ్‌లను డివిజన్లుగా చేయాలని భాస్కర్‌రావు డిమాండ్‌ చేశారు.