అమిత్‌షా తెలంగాణ పర్యటన.. పార్టీలోకి భారీ చేరికలు

తెలంగాణలో బీజేపీ ఎన్నికల శంఖం పూరించేందుకు సిద్ధమైంది. జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పాలమూరు నుంచి ప్రచార పర్వానికి నగారా మోగించనున్నారు. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లకు దీటుగా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తున్న కమలనాథులు.. ప్రజాకర్షక మేనిఫెస్టోపైనా ఫోకస్‌ చేశారు.

తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు సమరశంఖం పూరిచేందుకు కాషాయదళం సన్నద్ధమైంది. రేపట్నుంచి ఎన్నికల రణరంగంలోకి దూకేందుకు రంగం సిద్ధం చేసుకుంది. రాష్ట్రంలో అధికారమే లక్ష్యమని బయటకు చెబుతున్నా.. ప్రధాన ప్రతిపక్షంగా ఎదగాలన్న టార్గెట్‌తో సమరభేరి మోగిస్తోంది. ఈనెల 15న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా.. తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టబోతున్నారు.

15న ఉదయం పది గంటలకు హైదరాబాద్ చేరుకోనున్న అమిత్‌షా.. మొదట బషీర్‌బాగ్‌లోని అమ్మవారి దేవస్థానంలో పూజలు నిర్వహిస్తారు. తరువాత బీజేపీ కార్యాలయంలో శక్తి కేంద్రం ప్రతినిధులతో భేటీ కానున్నారు. మధ్యాహ్నం మీడియా సమావేశం తరువాత.. ఎన్నికల మేనేజ్‌మెంట్‌ కమిటీతో చర్చించనున్నారు. 119 నియోజక వర్గాల్లో అభ్యర్థుల ఎంపికపై సమాలోచనలు చేస్తారు. అదేరోజు సాయంత్రం మహబూబ్‌నగర్‌లో జరిగే ఎన్నికల శంఖారావ సభకు వెళ్లి కార్యకర్తలను, బీజేపీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారు. ఈ సభలో 119 నియోజకవర్గాలకు గుర్తుగా 119 ఢంకాలను అమిత్‌షా మోగించనున్నారు.

అమిత్‌షా పర్యటన సందర్భంగా పార్టీలో భారీగా చేరికలు ఉంటాయని బీజేపీ చీఫ్‌ లక్ష్మణ్‌ తెలిపారు. 20 సంవత్సరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మేనిఫెస్టో రూపకల్పన చేస్తున్నామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్లు కల్పించేందుకు సమాలోచనలు చేస్తున్నామన్నారు.

రాష్ట్ర అభివృద్ధికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే అడ్డంకి అని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా పాలమూరు శంఖారావం జరుగుతుందన్నారు.

మరోవైపు తెలంగాణ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించిన కమలనాథులు.. ఈనెల 20లోగా అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. మహబూబ్‌నగర్‌లో అమిత్‌షా పర్యటన తర్వాత అభ్యర్థుల లిస్ట్‌ రిలీజ్‌ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. 30 నుంచి 35 మంది అభ్యర్థుల పేర్లను ఇందులో చేరనున్నారు. వీరిలో 10 మందిని గ్రేటర్‌ హైదరాబాద్‌ నుంచి ఖరారు చేస్తారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.