శ్రీశైలం జలసిరి హారతి కార్యక్రమంలో పాల్గొనున్నచంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ కర్నూలు జిల్లాలో పర్యటిస్తారు. శ్రీశైలంలో జలసిరికి హారతి కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. జలాశయం దగ్గర కృష్ణా నదీ జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇవాళ్టి నుంచి వరుసగా మూడ్రోజులపాటు రాయలసీమ, ఉత్తరాంధ్ర, రాజధాని ప్రాంతంలో జలసిరికి హారతి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.

మనిషి మనుగడకు నీరే ఆధారం. ప్రకృతి సంపదైన జల వనరులను కాపాడుకునేలా.. వాటితో జనం బంధాన్ని పెంచడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం గతేడాది జలసిరికి హారతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈసారి కూడా మూడ్రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాయలసీమ, ఉత్తరాంధ్రలో, రాజధాని ప్రాంతంలో జలసిరికి హారతిలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు.

ఇవాళ కర్నూలు జిల్లాలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు… శ్రీశైలం డ్యామ్‌ దగ్గర జలసిరికి హారతి కార్యక్రమంలో పాల్గొంటారు. కృష్ణా నదికి పూజలు నిర్వహిస్తారు. అక్కడ్నుంచి నాగార్జున సాగర్‌ను సందర్శించి.. కృష్ణా నదీ జలాలకు పూజలు చేస్తారు. రేపు శ్రీకాకుళం జిల్లాలో జలసిరికి హారతిలో పాల్గొననున్న సీఎం.. ఎల్లుండి కొండవీటి వాగు ఎత్తిపోతలను ప్రారంభిస్తారు.

వరుసగా మూడ్రోజులపాటు జలసిరికి హారతి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మంత్రి దేవినేని ఉమ వెల్లడించారు. రాష్ట్రంలోని 40 నదులపై నిర్మించిన జలాశయాల్లో నీరు ఉందని తెలిపారు. రేపు నాగావళి-వంశధారల అనుసంధానం జరుగుతుందని ప్రకటించారు. వంశధార ఫేజ్ వన్‌ స్టేజ్‌ 2లో చంద్రబాబు పాల్గొంటారన్నారు.

సీఎం పర్యటన కోసం శ్రీశైలంలో ప్రజాప్రతినిధులు, అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. చంద్రబాబుకు 10 వేల మందితో స్వాగతం పలుకుతామని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. సున్నిపెంట, శ్రీశైలంలో సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి వాటికి కావలసిన నిధులను విడుదల చేయాలని కోరతామన్నారు.