మాల్యా వార్: బీజేపీని ఇరకాటంలోకి నెట్టిన సుబ్రమణ్యస్వామి

కాంగ్రెస్‌, బీజేపీ మధ్య మొన్నటివరకు రాఫెల్‌ ఫైట్. ఇప్పుడు విజయ్‌మాల్యా మాటలు మంటలు రేపుతున్నాయి.

9వేల కోట్ల రూపాయల అప్పులు ఎగ్గొట్టి లండన్ పారిపోయిన విజయ్‌ మాల్యా.. దేశ రాజకీయాల్లో కొత్త చిచ్చు పెట్టారు. దేశం వదిలి వెళ్లేముందు.. 2016లో తాను పార్లమెంట్‌లో జైట్లీతో మాట్లాడానని.. అప్పులు చెల్లించే ప్రణాళికలు వివరించానని అన్నారు. లండన్‌లోని వెస్ట్‌ మినిస్టర్ కోర్టుకు హాజరైన సందర్భంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు.

విజయ్‌ మాల్యా మాట్లాడిన వెంటనే రాహుల్‌ లైన్‌లోకి వచ్చారు. ఆర్థిక నేరగాడిని ప్రభుత్వం కాపాడుతోందని విమర్శించారు. దీనిపై ప్రధానమంత్రి స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అప్పటివరకు ఆర్థికమంత్రి పదవి నుంచి అరుణ్‌జైట్లీ దిగిపోవాలన్నారు.

మాల్యా, జైట్లీ మధ్య ఒప్పందం జరిగిందనడానికి తానే సాక్ష్యమన్నారు కాంగ్రెస్ ఎంపీ పూనియా. విజయ్ మాల్యా, అరుణ్ జైట్లీ పార్లమెంట్ సెంట్రల్ హాల్లో 20 నిమిషాల చర్చించుకున్నారని చెప్పారు. సీసీ కెమెరాలు పరిశీలిస్తే నిజాలు బయటికొస్తాయన్నారు. ఒక వేళ తాను చెప్పింది అవాస్తవమైతే రాజకీయాల నుంచి తప్పుకొంటా అని ప్రకటించారు.

దేశం నుంచి మాల్యా పారిపోవడం వెనుక ప్రభుత్వ సహకారం ఉందంటూ కాంగ్రెస్‌ వాగ్బాణాలు సంధించడం.. నేరుగా మోడీని టార్గెట్ చేయడంతో కమలనాథులు ఎదురుదాడికి దిగారు. 2014 నుంచి తాను మాల్యాకు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదన్నారు జైట్లీ. రాహుల్‌ లండన్‌లో పర్యటించి వచ్చాక.. మాల్యా తాజా వ్యాఖ్యలు చేయడం వెనుక అసలు రహస్యం ఏమిటో అర్థం చేసుకోవాలని కేంద్ర మంత్రులు, బీజేపీ నాయకులు అంటున్నారు.

కాంగ్రెస్ విమర్శలకు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ కౌంటర్ అటాక్ ఇచ్చారు. పూనియా ఒత్తిడిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. రాహుల్‌, మాల్యా ద్వయం అబద్దాలతో మభ్య పెడుతోందన్న ఆయన.. కింగ్‌ ఫిషర్ ఎయిర్‌లైన్స్‌తో రాహుల్ ఫ్యామిలీ, యూపీఏ ప్రభుత్వానికి ఉన్న లింకులు బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

ఇదే సమయంలో సొంత పార్టీ ఎంపీ సుబ్రమణ్య స్వామి చేసిన వ్యాఖ్యలు బీజేపీని మరింత ఇరకాటంలోకి నెట్టాయి. లండన్‌ వెళ్లిపోతున్నట్టు జైట్లీకి మాల్యా చెప్పిన విషయం తిరుగులేని వాస్తవమన్నారు స్వామి. ఆయనపై 2015 అక్టోబర్ 24న ఇచ్చిన లుక్‌ఔట్‌ నోటీస్‌ కూడా బలహీన పరిచారని అన్నారాయన.

భారత్‌ వచ్చేందుకు ససేమిరా అంటున్న విజయ్ మాల్యా.. ఒకప్పుడు మీడియాకు మొహం చాటేసేవాడు. ఈమధ్య కాస్త హుషారుగా కనిపిస్తూ.. కామెంట్స్‌ చేస్తున్నాడు. బుధవారం చేసిన వ్యాఖ్యలు బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య తీవ్రస్థాయిలో అగ్గి రాజేశాయి.