మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలకు చేదు అనుభవం

టీఆర్ఎస్ పార్టీని తాను వీడబోనన్నారు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు. టికెట్ తనకు ఇవ్వకున్నా.. అధిష్టానం సూచించిన వ్యక్తి గెలుపుకోసం కృషి చేస్తానని చెప్పారు. ఆదిశగానే పని చేయాలని కార్యకర్తలకు సూచించారు. మరోవైపు.. అభిమాని దాడిలో గాయపడ్డ వారిని పరామర్శించేందుకు వెళ్లిన ఓదేలుకు ఆసుపత్రిలో చేదు అనుభవం ఎదురైంది.

ముందస్తు ఎన్నికలకు అభ్యర్ధులను ప్రకటించిన తరువాత చెలరేగిన నిరసన జ్వాలను.. గులాబీ పార్టీ క్రమంగా చల్లార్చుతోంది. నిరసన గళం వినిపించిన నేతలను ఒకొక్కరిగా బుజ్జగిస్తోంది. చెన్నూరు స్థానాన్ని ఎంపీ బాల్క సుమన్‌కు కేటాయించడాన్ని సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు తీవ్రంగా తప్పుపట్టారు. అధిష్ఠానంపై తిరుగుబాటు బావుటా ఎగుర వేశారు. బుధవారం బాల్క సుమన్ ప్రచారం ప్రారంభం సందర్భంగా ఓదేలు అనుచరుడు గట్టయ్య పెట్రోల్‌తో హల్‌చల్ చేశాడు. ఆత్మహత్యకు యత్నించడంతో.. పెట్రోల్ మీద పడి.. 16మందికి తీవ్ర గాయాలయ్యాయి.

ఘటనను తీవ్రంగా పరిగణించిన కేసీఆర్.. ఓదేలును బుజ్జగించేందుకు స్వయంగా ఆయనే రంగంలోకి దిగారు. ఓదేలుతో సమావేశమై చర్చించారు. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని కేసీఆర్‌ హామీ ఇచ్చినట్లు ఓదేలు చెప్పారు. కేసీఆర్‌ మాటే తనకు శిరోధార్యమన్న ఓదేలు.. పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కార్యకర్తలు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ అభ్యర్థి గెలిస్తేనే కేసీఆర్‌ ముఖ్యమంత్రి అవుతారని కార్యకర్తలకు సూచించారు.

అంతకు ముందు.. నల్లాల ఓదేలుకు చేదు అనుభవం ఎదురైంది. ఇందారం ఘటనలో గాయపడిన వారిని పరామర్శించేందుకు హైదరాబాద్ యశోద ఆస్పత్రికి వెళ్లిన ఆయన్ను.. బాధితుల కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. ఓదేలు వల్లే తమ వారు ఆసుపత్రి పాలయ్యారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడ్ని అడ్డుకొని.. గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో నల్లాల ఓదేలు వెనుదిరగాల్సి వచ్చింది.