అంగరంగ వైభవంగా శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. స్వామి, అమ్మవార్లకు ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించారు. తొలి వాహన సేవలో భాగంగా మలయప్పస్వామి ఉభయదేవేరులతో ఆశీనుడై.. పెద్దశేషవాహనంపై తిరుమాడవీధులలో విహరించారు. ఆ కోనేటి రాయుని దివ్య దర్శనాన్ని భక్తులు దర్శించి తరించారు.

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు నేత్ర పర్వంగా సాగుతున్నాయి. వేదపండితుల మంత్రోచ్చారణలు, మంగళవాయిద్యాల నడుమ అష్టదిగ్పాలకులు, సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ స్వామివారి వాహనమైన గరుడుని చిత్రించిన ధ్వజ పటాన్ని తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. టీటీడీ అర్చకుల తరఫున ఖాద్రినరసింహాచార్యులు.. బ్రహ్మోత్సవాల నిర్వహణకు టీటీడీ యజమానుదారుగా ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ కంకణం ధరించారు. ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు, వేదపండితులు వైఖానస ఆగమ సంప్రదాయాలను అనుసరిస్తూ విశిష్ట పూజలు నిర్వహించి ధ్వజ స్తంభానికి ధ్వజపటంను ఎగురవేశారు. తరువాత తిరుమలరాయ మండపంలో ఆస్థానం, విశేష సమర్పణ కార్యక్రమం చేపట్టారు.

శ్రీవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పట్టు వస్త్రాలు సమర్పించారు. అంతకుముందు బేడీ ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకున్న చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, మంత్రి నారా లోకేశ్‌, బ్రాహ్మణి, దేవాన్ష్‌.. అఖిలాండం వద్ద పూజలు చేసి ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు సీఎం తలకు పరివస్త్రం చుట్టి పట్టు వస్త్రాలను తలపై ఉంచారు. ఆలయ మర్యాదలతో మహాద్వారం వద్దకు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు.

బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. ఆదిశేషునిపై అనంతశయనుడు విహరించాడు. తొలి వాహన సేవలో భాగంగా మలయప్పస్వామి ఉభయదేవేరులతో కలిసి పెద్దశేషవాహనంపై తిరుమాడవీధుల్లో విహరించారు. శ్రీమన్నారాయణుడి వాహన సేవను కనులారా వీక్షించేందుకు వేలాది భక్త జనం తిరుమలకు పోటెత్తింది. సర్పశ్రేష్టుడైన ఆదిశేషువుపై స్వామి వారి వైభవాన్ని కనులారా తిలకించి పులకించింది.

బ్రహ్మోత్సవాల్లో భాగంగా నామాల వాడు.. ఇవాళ ఉదయం 9గంటలకు చిన శేష వాహన సేవ.. రాత్రి 8గంటలకు హంస వాహన సేవ జరగనుంది.