మద్యం మత్తులో బతికున్న పాముని పరపరా.. నాలుగ్గంటల్లో.. వీడియో

చుక్కేస్తే చుట్టూ ఉన్నవాళ్లు ఎవరూ కనిపించరు. తానేంచేస్తున్నాడో తనకే తెలియదు. ఆ కిక్కు అంతగా మాయచేస్తుంది. తన జీవితంతో పాటు. తన మీద ఆధారపడ్డ కుటుంబాన్ని కూడా రోడ్డున పడేస్తాడు. ఉత్తరప్రదేశ్‌ అమ్‌రోహ జిల్లాలోని మహిపాల్ సింగ్ రోజు కూలీగా జీవనం సాగిస్తున్నాడు. అతడికి రోజూ మద్యం తాగే అలవాటు ఉంది. బుధవారం మరికాస్త ఎక్కువ తాగాడు. తూలుతూ ఇంటికొస్తున్నాడు.

రోడ్డు మీద ఓ పాము పిల్ల వెళుతుంటే దాని చుట్టూ చేరి ఆకతాయి పిల్లలు ఆడుకుంటున్నారు. అక్కడికి చేరుకున్న మహిపాల్ మత్తులో పాము పిల్లను చేతిలోకి తీసుకున్నాడు. దానితో కాసేపు ఆటలాడాడు. ఏం చేస్తావు దాన్ని.. తింటావా ఏంటి.. అని పిల్లలు అనేసరికి నిజంగానే నోట్లో పెట్టుకున్నాడు. పంటికింద నలిగి అది కాస్తా గొంతులోకి జారిపోయింది. ఎంత ప్రయత్నించినా లోపలికి వెళ్లిన పాము బయటకు రాలేదు. పాము చిన్నదైనా విషసర్పం కావడంతో నాలుగ్గంటల్లోనే దాని విషం మహిపాల్ ఒళ్లంతా వ్యాపించి మరణించాడు. ఈ దృశ్యాన్నంతా స్థానికులు చోద్యం చూస్తున్నట్లు చూడడమే కాకుండా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది.