మిర్యాలగూడ యువకుడి హత్య కేసులో కొత్తకోణం

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో యువకుడి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి.. వేరే కులం వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుందన్న కోపంతోనే అల్లుడు ప్రణయ్‌ని హత్యచేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.. యువతి వర్షిణి వైశ్యులు కాగా.. యువకుడు పెరుమాళ్ల ప్రణయ్ ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి. వీళ్లిద్దరూ బీటెక్‌ నుంచి ప్రేమించుకుంటున్నారు. ప్రేమ విషయం వర్షిణి ఇంట్లో తెలియడంతో ఆమె తండ్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.. అమ్మాయిని వేధింపులకు గురిచేశాడు.. అయితే, వర్షిణి మాత్రం ప్రణయ్‌ని వదలిపెట్టలేదు.. తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోరని హైదరాబాద్‌ పారిపోయారు. ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకుని ఇక్కడే కాపురం పెట్టారు.. అప్పట్నుంచి వర్షిణి తండ్రి మారుతీరావు నుంచి బెదిరింపులు వస్తూనే ఉన్నాయి.

వేధింపులు మరింత పెరగడంతో వర్షిణి, ప్రణయ్‌ ఐజీని ఆశ్రయించారు. తమకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కోరారు. ఐజీ ఆదేశాలతో ఎస్పీ యువతి, యువకుడి తరపు తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చారు.. ఆ తర్వాత నుంచి మారుతీరావు ప్రవర్తనలో మార్పు వచ్చింది.. కూతురితో సఖ్యంగానే ఉంటున్నాడు.. రెగ్యులర్‌గా ఫోన్లు మాట్లాడటం, తరచూ వారిని చూసేందుకు వస్తుండటంతో అంతా సర్దుకుపోయిందని భావించారు. పోలీసులు కూడా కలిసున్నారనే అనుకున్నారు.. కానీ, మారుతీరావు ఓ వైపు మంచిగానే నటిస్తూ, మరోవైపు నుంచి తన ప్లాన్‌ అమలుచేశాడు.. ఇందులో భాగంగానే ఓ గ్యాగ్‌కు సుపారీ ఇచ్చి అల్లుణ్ని అడ్డుతొలగించుకోవాలనుకున్నాడు.