మిర్యాలగూడ యువకుడి హత్య కేసులో సంచలన విషయాలు..

వారిద్దరి ప్రేమ పెద్దవారిలో పగను పెంచింది.. అన్యోన్యంగా ఉంటున్న ఆ జంటను చూసి కళ్లలో నిప్పులు పోసుకున్నాడు అమ్మాయి తండ్రి.. బయటకు ప్రేమ నటిస్తూనే మనసులో కుట్ర పెంచుకున్నాడు. అల్లుణ్ని అడ్డుతొలగించుకునేందుకు సుపారీ గ్యాంగ్‌ను దించాడు. వారు పక్కా ప్లాన్‌తో రెక్కీ నిర్వహించి యుకుణ్ని హత్య చేశారు. నల్గొండ జిల్లాలో జరిగిన పరువు హత్య కలకలం రేపుతోంది.

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పరువు హత్య సంచలనం కలిగిస్తోంది.. తన కూతురు ప్రేమ పెళ్లి చేసుకోవడం తట్టుకోలేకపోయిన తండ్రి.. యువకుణ్ని దారుణంగా హత్య చేయించాడు. మిర్యాలగూడలోని జ్యోతి ఆస్పత్రి ఆవరణలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది.

మిర్యాలగూడకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి మారుతీరావు కూతురు అమృత వర్షిని, పెరుమాళ్ల ప్రణయ్ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. బీటెక్‌ చదువుకునే సమయంలోనే వీరి మధ్య ప్రేమ మొదలైంది. యువతి వర్షిణి వైశ్యులు కాగా.. యువకుడు పెరుమాళ్ల ప్రణయ్ ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి. వీరిద్దరి ప్రేమ విషయం వర్షిణి ఇంట్లో తెలియడంతో ఆమె తండ్రి తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. చంపేస్తానంటూ బెదిరింపులకు దిగాడు.. అయితే, వర్షిణి మాత్రం ప్రణయ్‌ని వదలిపెట్టలేదు. తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోరని హైదరాబాద్‌ పారిపోయారు. ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకుని ఇక్కడే కాపురం పెట్టారు.. అప్పట్నుంచి వర్షిణి తండ్రి మారుతీరావు నుంచి బెదిరింపులు వస్తూనే ఉన్నాయి.

వేధింపులు మరింత పెరగడంతో తమకు రక్షణ కల్పించాలంటూ వర్షిణి, ప్రణయ్‌ ఐజీని ఆశ్రయించారు. ఐజీ ఆదేశాలతో ఎస్పీ యువతి, యువకుడి తరపు తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపించేశారు. ఆ తర్వాత నుంచి మారుతీరావు ప్రవర్తనలో మార్పు వచ్చింది. కూతురు, అల్లుడితో సఖ్యంగానే ఉంటున్నాడు.. రెగ్యులర్‌గా ఫోన్లు మాట్లాడటం, తరచూ వారిని చూసేందుకు వస్తుండటంతో అంతా సర్దుకుపోయిందని భావించారు. పోలీసులు కూడా కలిసున్నారనే అనుకున్నారు. కానీ, మారుతీరావు ఓ వైపు మంచిగానే నటిస్తూ, మరోవైపు నుంచి తన ప్లాన్‌ అమలుచేశాడు. వారి కదలికలపై నిఘా పెట్టాడు. ఇందులో భాగంగానే ఓ గ్యాగ్‌కు సుపారీ ఇచ్చి అల్లుణ్ని అడ్డుతొలగించుకోవాలనుకున్నాడు. అనుకున్నట్టుగానే 10 లక్షలకు బేరం కుదుర్చుకుని ఓ గ్యాంగ్‌ను రంగంలోకి దించాడు. కొంతకాలంగా రెక్కీ నిర్వహించిన ఈ గ్యాంగ్‌ అదును చూసి ఘాతుకానికి తెగబడింది.

ఇటీవలే అమృత వర్షిణి, ప్రణయ్‌ మిర్యాలగూడలో రిసెప్షన్‌ చేసుకున్నారు. ఈ రిసెప్షన్‌ను యువకుడి తల్లిదండ్రులే దగ్గరుండి జరిపించారు. ప్రస్తుతం వర్షిణికి ఐదో నెల.. స్థానిక ఆస్పత్రిలో చెకప్‌ చేయించుకునేందుకు వచ్చారు. అప్పటికే మాటు వేసిన గ్యాంగ్‌ ప్రణయ్‌ని వెంబడించింది.. కిల్లర్‌ వెనుక నుంచి కత్తితో నరికాడు. ఆ వేటుకు ప్రణయ్‌ కుప్పకూలిపోయాడు.. ఆ వెంటనే మరో రెండుసార్లు నరికి కత్తిని వదిలి సుపారీ కిల్లర్‌ అక్కడ్నుంచి పారిపోయాడు. ఇదంతా సీసీ కెమెరాలో రికార్డ్‌ అయింది.

ప్రణయ్‌ హత్యకు గురయ్యాడని తెలియగానే వర్షిణి తండ్రి మారుతీరావు పరారయ్యాడు. అటు ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు జరుపుతున్నారు.

ఈ ఘటన స్థానికంగా సంచలనం రేకెత్తిస్తోంది.. కూతురి సుఖం కోరుకోవాల్సిన తండ్రే ఇలా కిరాతకంగా ప్రవర్తించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మారుతీరావును కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

-ADVT-