22 ఏళ్లలోపు యువకులు.. ఓ మైనర్..

అంతా 22 ఏళ్లలోపు యువకులే. చెడు వ్యసనాలకు బానిసలై ఈజీ మనీ కోసం చోరీలకు పాల్పడటం అలవాటుగా మార్చుకున్నారు. దేవాలయాలు, తాళం వేసిన ఇళ్లు, ఆరుబయట పార్క్ చేసిన వాహనాలు ఇలా అవకాశం ఉన్న ప్రతీ చోట దొంగతనాలకు తెగబడ్డారు. సీసీ కెమెరాలు, జనసంచారం లేని ప్రదేశాలనే ఈ ముఠా టార్గెట్ గా చేసుకునేది. బెజవాడ పోలీసులకు సవాలుగా మారిన ఈ చోరీ ముఠాను ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి ఒక ఇన్నోవా కారు, 2 ఆటోలు, 21 టూవీలర్లను స్వాధీనం చేసుకున్నారు.

వాహనాలతో పాటు 24 చోరీలకు పాల్పడింది ఈ దొంగల ముఠా. ఈ 24 కేసుల్లో దాదాపు 15 లక్షల రూపాయలు విలువచేసే 20 గ్రాముల బంగారు అభరణాలు, 16 గ్రాముల వెండి వస్తువులు, 3 లక్షల 80 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.

చోరీ ముఠాలో ఉన్నవాళ్లంతా విజయవాడ శివారులోని అజిత్ సింగ్ నగర్, భవానిపురం ప్రాంతాలకు చెందినవాళ్లే. అరెస్టైన తొమ్మిది మందిలో ఒకరు మైనర్ కూడా ఉన్నారు. నగర బహిష్కరణ తర్వాత సిటీలోకి ఎంటరైన నెలటూరి రవి..ముఠాను తయారు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.