చంద్రబాబుపై నాన్‌బెయిలబుల్ వారెంట్..మోడీ కుట్ర దాగి ఉందని..

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై నాన్ బెయిల బుల్ వారెంట్ జారీ అయింది. ఈనెల 21లోగా చంద్రబాబు సహా 16మందిని కోర్టులో హాజరు పరచాలని ధర్మాబాద్ కోర్టు ఆదేశించింది. మరోవైపు ఎనిమిదేళ్ల తరువాత కేసులో వారెంట్ లు జారీకావడాన్ని తెలుగుదేశం పార్టీ తప్పుపట్టింది. ప్రధాని నరేంద్రమోడీ.. ఓ పథకం ప్రకారం చంద్రబాబుపై కుట్రలు పన్నుతున్నారని ఆరోపించింది. కోర్టు నోటీసులు అందితే చంద్రబాబు హాజరవుతారన్న పార్టీ నేతలు.. కేసుపై తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించాలని డిమాండ్ చేశారు.

బాబ్లీ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ.. 2010లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేపట్టిన ఆందోళన.. అరెస్ట్‌ల అంశం ఇప్పుడు తెరపైకి వచ్చింది. దాదాపు ఎనిమిదేళ్ల తరువాత ఆ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుపై నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. బాబ్లీ నిర్మిస్తే ఉత్తర తెలంగాణ ఎడారి అవుతుందంటూ 40 మంది ఎమ్మెల్యేలతో కలిసి అప్పట్లో ప్రతిపక్షనేతగా ఉన్న చంద్రబాబు నాయుడు తెలంగాణ సరిహద్దుదాటి మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించారు. మహారాష్ట్ర పోలీసులు అడ్డుకోవడంతో.. అక్కడే చంద్రబాబు ఆందోళనకు దిగారు. దీంతో చంద్రబాబుతో పాటు 40 మంది ఎమ్మెల్యేలను అరెస్టు చేసిన మహారాష్ట్ర పోలీసులు నాన్‌బెయిలబుల్‌ కేసు నమోదుచేశారు. అప్పటి నుంచి ఈ కేసు ధర్మాబాద్‌ కోర్టులో పెండింగ్‌లో ఉంది.

బాబ్లీ కేసుకు సంబంధించి ఇటీవల మహారాష్ట్ర వాసి ధర్మాబాద్‌కోర్టులో పిటిషన్‌ వేయడంతో మళ్లీ తెరపైకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో పాటు మరో 14 మందికి నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయింది. బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా 2010లో చేసిన పోరాటానికి గాను ఈ వారెంట్‌ను ధర్మాబాద్‌ కోర్టు జారీ చేసింది. చంద్రబాబును కోర్టులో హాజరుపరచాలని పోలీసులను ఆదేశించింది. ఈ నెల 21లోగా చంద్రబాబు సహా అందరూ హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది.

బాబ్లీ కేసులో కోర్టు నోటీసులు అందితే.. చంద్రబాబు హాజరవుతారని మంత్రి లోకేష్ చెప్పారు. తెలంగాణ ప్రయోజనాల కోసం నాడు బాబ్లీపై చంద్రబాబు పోరాడారని గుర్తు చేశారు. మహారాష్ట్ర పోలీసులు అన్యాయంగా అరెస్టు చేయడంతో నాడు చంద్రబాబు బెయిల్‌ తీసుకునేందుకు నిరాకరించారని చెప్పారు. ధర్మాబాద్‌ పోరాటంలో చంద్రబాబు తెగువ దేశమంతా చూసిందన్న లోకేష్.. అరెస్టులకు ఏ నాడు భయపడలేదన్నారు.

అటు చంద్రబాబుకు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేయడాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా తప్పుపట్టింది. ఎనిమిదేళ్ల క్రితం ఇప్పుడు తెరపైకి రావడం ముమ్మాటికి రాజకీయ కక్షగానే పేర్కొంది. మొత్తం వ్యవహారం వెనుక ప్రధాని నరేంద్ర మోడీ కుట్ర దాగి ఉందని ప్రభుత్వ విప్ బుద్దా వెంకన్న ఆరోపించారు. ప్రధాని ఓ నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి నోటీసు ఇవ్వకుండా అరెస్ట్ వారెంట్ ఎలా జారీ చేస్తారని ప్రశ్నించిన ఆయన.. చంద్రబాబు జోలికి వస్తే.. తెలుగు ప్రజల నిరసన సెగలను మోడీ తట్టుకోలేరని హెచ్చరించారు.

ఎనిమిదేళ్లు స్తబ్దుగా ఉన్న కేసు.. ఇప్పుడు తెరపైకి రావడం.. అందులోనూ చంద్రబాబుపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ కావడం రాజకీయంగా దుమారం రేపుతోంది. ఉత్తర తెలంగాణ కోసం పోరాడిన చంద్రబాబుకు అండగా.. టీఆర్ఎస్ పార్టీ నిలవాలని తెలుగుదేశం నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరి దీనిపై అటు కేసీఆర్.. ఇటు చంద్రబాబు ఎలా స్పందిస్తారన్నది చర్చనీయాంశమైంది.