భద్రతా బలగాల చేతిలో ముగ్గురు ఉగ్రవాదులు హతం

జమ్ము కశ్మీర్‌లో భద్రతా బలగాల చేతిలో ముగ్గురు ఉగ్రవాదులు హత మయ్యారు. బారాముల్లా జిల్లాలో సైన్యం, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు టెర్రరిస్టులు చనిపోయారు. సోఫోర్‌లోని చింకిపొర ప్రాంతంలో తీవ్రవాదులు ఉన్నారన్న సమాచారం మేరకు భద్రతా దళాలు కూంబింగ్ చేపట్టాయి. సైన్యం సోదాలు జరుపుతుండగా ఓ ఇంట్లో దాక్కున్న ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. భద్రతా దళాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు.

మరో వైపు రీసీ జిల్లా క్రియాల్‌ ప్రాంతంలో జరిగిన మరో కాల్పుల ఘటనలో జైషే మహమ్మద్‌ ఉగ్రవాది హతమయ్యాడు. ఈ కాల్పుల్లో డీఎస్పీ సహా 12మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారు. వారిలో జమ్మూ డీఎస్పీ కూడా ఉన్నారు. కాల్పులు జరిగిన సమయంలో భద్రతా బలగాలు జమ్ములో హెలికాప్టర్లు, డ్రోన్ల ద్వారా కూంబింగ్‌ నిర్వహించాయి. ఈ నేపథ్యంలో నాగ్రోటా-ఝాజర్‌ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి.. భద్రతాధికారులకు కీలకమైన సమాచారం అందించాడు. రాత్రి 8 గంటల సమయంలో ముగ్గురు ఉగ్రవాదులు ఇంట్లోకి చొరబడి బిస్కెట్లు, దుస్తులు పట్టుకుపోయారని తెలిపాడు. జమ్ము – శ్రీనగర్‌ హైవేలో ఓ జవాను, ఫారెస్ట్‌ గార్డ్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. తమ వాహనాన్ని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. ఘటనాస్థలిలో పోలీసులు ఏకే 47 రైఫిల్‌, మూడు మ్యాగజైన్లు స్వాధీనం చేసుకున్నారు.