కేసీఆర్ ఆ సెంటిమెంట్ రిపీట్ చేస్తారా?

trs, kcr

ఒకప్పుడు కూటమి కట్టి విజయం సాధించిన పార్టీ.. తర్వాత ఎన్నికల్లో తమకు వ్యతరేకంగా వచ్చిన కూటమిని ఓడించి అధికారపగ్గాలు అందుకుంది. మరి ఒకప్పుడు కూటమిలో విభిన్న ఫలితాలు చవిచూసిన TRS తనకు సవాలు విసురుతున్న ప్రత్యర్థులను ఎలా ఢీకొడతారు? గతం చెబుతున్న అనుభవాలేంటి? రెండోసారి వరుస విజయాలతో సెంటిమెంట్ రిపీట్ చేస్తారా? ఓటమితో చరిత్రకెక్కుతారా?

2004లో కాంగ్రెస్ నేతృత్వంలోని టిఆర్ఎస్ జట్టుకట్టి విజయం సాధించాయి. అయితే 2009 నాటికి పరిస్థితులు తిరగబడ్డాయి. 2004లో కాంగ్రెస్ తో జతకట్టిన పార్టీలన్నీ దూరమయ్యాయి. తిరిగి టీడీపీతో కలిసి 2009లో మహాకూటమిగా ఏర్పడ్డాయి. టీడీపీ, టిఆర్ఎస్, లెఫ్ట్ పార్టీలు కలిసికట్టుగా ఎన్నికల్లో తలపడ్డాయి. అయినా ఓటమి తప్పలేదు. 2004లో మిత్రపక్షాల సాయంతో గెలిచిన కాంగ్రెస్.. 2009లో ఒంటరిగా గెలిచింది. కాంగ్రెస్ 156 సీట్లు సాధించింది. టీడీపీ 92 సీట్ల వద్ద ఆగిపోయింది. టీఆర్ఎస్ పదిసీట్లకే పరిమితమైంది. సీపీఐ 4, సీపీఎం ఒక్క స్థానం మాత్రమే గెలిచాయి. కొత్తగా ఏర్పడిన ప్రజారాజ్యం పార్టీ 18 సీట్లు సాధించింది. ఐదేళ్ల తేడాలో కూటములపై అంచనాలు తలకిందులయ్యాయి. ఒకసారి గెలిచి.. మరోసారి ఓటమిపాలవడం సంచలనంగా మారింది. 2004 నుంచి ఎన్నికల రాజకీయాల్లో ముఖ్యంగా కూటముల్లో భాగస్వామిగా ఉన్న TRS విభజనతో తెలంగాణలో ప్రధాన రాజకీయ పార్టీగా అవతరించింది. 2014 ఎన్నికల్లో TRS 63 సీట్లు గెలుచుకొని తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ ప్రధానప్రతిపక్షానికి పరిమితమైంది. ఇప్పుడు మళ్లీ కేసీఆర్ ముందుగానే అసెంబ్లీని రద్దు చేయడం.. అటు విపక్షాలన్నీ మహాకూటమిగా ఏర్పడుతుండడంతో ఒక్కసారిగా అందరి ఆలోచనలు గతంలోకి వెళుతున్నాయి.

ఎన్నికల శంఖారావాన్ని పూరించిన కేసీఆర్.. 105 సీట్లలో అభ్యర్దులను కూడా ప్రకటించి ప్రతిపక్షాలకు సవాలు విసిరారు. అటు ప్రతిపక్షాలు కాంగ్రెస్ సారధ్యంలో మహాకూటమిగా ఏర్పడేందుకు అంగీకారానికి వచ్చాయి.. టీడీపీ, సీపీఐ, జనసమితి, ఇంటిపార్టీలు కాంగ్రెస్ తో జతకట్టడానికి సిద్దమయ్యాయి. ఒకప్పుడు పరస్పరం ఓడించుకోవడానికి కాంగ్రెస్ – టీడీపీలు మహాకూటమిలకు నేతృత్వం వహించాయి. ఇప్పుడు ఈ రెండు పార్టీలు కలిసి కూటమిగా ఆవిర్భవించాయి. 2004, 2009లో కూటమిలో చిన్న భాగస్వామ్యపార్టీగా ఉన్న TRSను ఇప్పుడు ఓడించడానికి నాడు మహాకూటముల్లో పెద్దన్న పాత్ర పోషించిన పార్టీలు ఏకమవడం ఓ చరిత్రగానే చూడాలి.

ఒకప్పుడు కాంగ్రెస్- టీడీపీలకే కాదు.. అన్ని పార్టీలకు మహాకూటమి విభిన్న పాఠాలు నేర్పింది. ముందస్తు నిర్ణయాలు.. వరుస విజయాలు కూడా నమోదు అయిన సందర్భాలున్నాయి. కేసీఆర్ ముందు ఇప్పుడు మూడు అనుభవాలున్నాయి. ఇందులో ఏది రిపీట్ చేస్తారన్నదే అసలు చర్చ. గతంలో ముందస్తుకు వెళ్లిన టీడీపీ రెండుసార్లు ఓటమి చవిచూసింది. ఈ సెంటిమెంట్ ను కేసీఆర్ లైట్ గా తీసుకుంటున్నారు. గెలుస్తామని ధీమాగా.. చరిత్ర సృష్టిస్తామని భరోసాగా ఉన్నారు. TRSవిజయం సాధిస్తే కేసీఆర్ చరిత్ర తిరగరాసినట్టే. మహాకూటిమి ఒకసారి విజయం సాధిస్తే.. మరోసారి పరాజయం ఇలా మిశ్రమ ఫలితాలు వచ్చాయి. 2004లో TRS మహాకూటమిలో భాగస్వామి. అప్పుడు విజయం వరించింది. 2009లోనూ కూటమిలో ఉంది. అప్పుడు మాత్రం పరాజయం తప్పలేదు. ఒకప్పుడు కూటమిలో ఉన్న TRS ఇప్పుడు ప్రత్యర్ధి కూటమిని ఓడిస్తుందా? 1994, 1999లో టీడీపీ, 2004, 2009లో రెండు సార్లు కాంగ్రెస్ ప్రభుత్వాలు వరుసగా ఏర్పడ్డాయి. 2014లో గెలిచిన టీఆర్ఎస్ మరోసారి గెలుస్తే ఈ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుంది.

గత అనుభవాలు విచిత్రంగా ఉన్నాయి. ఒక్కోసారి ఒక్కో ఫలితం వచ్చింది. ఊహకందని ఫలితాలు వచ్చాయి. కేసీఆర్ గెలిస్తే మహాకూటమిని మట్టి కరిపించినవారవుతారు. రెండోసారి అధికారాన్ని నిలబెట్టుకుని సెంటిమెంట్ నిజం చేసిన నాయకుడు అవుతాడు. ముందస్తు సెంటిమెంట్‌ను ఛేదించిన ఘనత దక్కుతుంది. ఓటమి పాలైతే మహాకూటమి కలిసిరాలేదన్న చర్చ జరుగుతోంది. ముందస్తు ఓటమి సెంటిమెంట్ నిజం అవుతుంది. వరుస విజయాల సెంటిమెంట్ కు బ్రేకు పడుతుంది. మరి కేసీఆర్ ముందున్న ఈ మూడు సవాళ్లలో రాబోయే ఎన్నికల్లో ఏ ఫలితం నిజం చేస్తుందన్నది కాలమే చెప్పనుంది.