కేసీఆర్ ముందు మూడు అనుభవాలు.. ఇదే రిపీట్ చేస్తారా..?

ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌లో కీలకమైన మూడు రాజకీయ ఘట్టాలు.. ప్రస్తుతం తెలంగాణలో పునరావృతం అవుతాయా? ముందస్తుకు వెళ్లిన రాజకీయ పార్టీలు చేదు ఫలితాలను చవిచూశాయి. అధికార పార్టీకి వ్యతిరేకంగా ఏకమైన విపక్షాలు ఒకసారి జయకేతనం ఎగరేస్తే.. మరోసారి భంగపడ్డాయి. గతంలో రెండు ప్రధానపార్టీలు వరుసగా రెండుసార్లు అధికారాన్ని నిలబెట్టుకున్నాయి. మరి తెలంగాణలో ఏం జరుగుతుంది.? కేసీఆర్ ముందు మూడు అనుభవాలున్నాయి. ఇందులో దేనిని రిపీట్ చేస్తారు.? కొత్త చరిత్రను సృష్టిస్తారా..?

9నెలలు ముందస్తుగానే ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీని రద్దుచేసి ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. ప్రతిపక్షాలు మహాకూటమిగా ఏర్పడుతున్నాయి. TRS ఓటమే లక్ష్యంగా చర్చలు జరుపుతున్నాయి. తాజా పరిణామాలపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికర చర్చ సాగుతోంది. గతంలో అనుభవాలను దృష్టిలో పెట్టుకుని జయాపజయాలపై విశ్లేషకులు అటు సామాన్యులు అంచనాలు వేస్తున్నారు. ముందస్తుకు వెళ్లినవారు బొల్తాపడ్డారని కొందరు… కూటమి కట్టినప్పుడు కొన్ని సార్లు గెలిచారు. మరికొన్నిసార్లు అపజయం మూటగట్టుకున్నారని మరికొందరు గుర్తు చేస్తున్నారు. ఇక వరుసగా అధికారం అందుకోవడం కొన్ని పార్టీలకు సాధ్యమైంది. మరి ఈ మూడు అనుభవాలను సవాళ్లుగా తీసుకుని కేసీఆర్ ఎలాంటి ఫలితం చూపించబోతున్నారు. ఏ సెంటిమెంట్ రిపీట్ చేస్తారన్నదే ఇప్పుడు అందరిలో ఉత్కంఠ రేపుతోంది.

1983 వరకు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌దే హవా. 1956 నుంచి 83 వరకు ఆరుసార్లు ప్రభుత్వాన్నిఏర్పాటు చేసింది. 1983లో నందమూరి తారకరామారావు టీడీపీని స్థాపించిన తర్వాత సమీకరణాలు మారిపోయాయి. 9నెలల్లోనే ఎన్టీయార్ అధికారపగ్గాలు అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ 7వ ముఖ్యమంత్రిగా కాంగ్రెసేతర ప్రభుత్వంతో చరిత్ర సృష్టించారు. ఇక్కడి నుంచి రాష్ట్ర రాజకీయాలు వేగంగా మారుతూ వచ్చాయి. నాదెండ్ల భాస్కర్ రావు వర్గం టీడీపీని చీల్చడంతో.. రాజకీయ సంక్షోభం ఏర్పడింది. నెలరోజుల్లోనే ఎన్టీయార్ అధికారంలోకి వచ్చారు. అయితే ఆయన ప్రభుత్వం రద్దుచేసి 85లో ఎన్నికలకు వెళ్లి విజయం సాధించారు. నమ్మకమో.. అతివిశ్వాసమో కానీ 1990 వరకూ ప్రభుత్వానికి గడువున్నా.. ఎన్టీయార్ 89లోనే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లారు. ఆయన ముందస్తు వ్యూహం ఛేదు ఫలితాన్ని ఇచ్చింది. 181 సీట్లు గెలుపొందిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మర్రి చెన్నారెడ్డి సీఎంగా ప్రభుత్వం ఏర్పాటైంది. తెలుగుదేశం కేవలం 74 సీట్లకు పడిపోయింది. సీపీఐ 8 సీట్లు గెలుపొందింది. సీపీఎం 6 స్థానాలు కైవసం చేసుకుంది. జనతాదళ్ 4 చోట్ల పోటీ చేసి ఒకేస్థానం గెలుపొందింది. బీజేపీ 12 స్థానాలు పోటీ చేసి ఐదుచోట్ల విజయం సాధించింది. టీడీపికి ముందస్తు, కూటమి రెండూ కలిసిరాలేదు.

కానీ ఐదేళ్లు తిరిగే సరికి మళ్లీ ఫలితాలు మారిపోయాయి. 1994లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ – లెఫ్ట్ కూటమి ప్రభంజనం సృష్టించింది. 216 సీట్లలో టీడీపీ జయకేతనం ఎగరేయగా.. కాంగ్రెస్ 26 సీట్లకే పరిమితమైంది. 280 స్థానాల్లో పోటిచేసిన బీజేపీ కేవలం 3 చోట్ల గెలుచుకుంది. 96లో నాయకత్వ మార్పు జరిగి చంద్రబాబు చేతుల్లోకి పార్టీ వచ్చింది. మారిన సమీకరణాల్లో టీడీపీ.. లెఫ్ట్ పార్టీలను కాదని.. బీజేపీతో కలిసి 1999లో పోటీచేశారు. 170 చోట్ల గెలిచిన టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చింది. బీజేపీ 24 చోట్ల పోటిచేసి 10 సీట్లను గెలిచింది. కాంగ్రెస్ 91చోట్ల విజయం సాధించి ప్రతిపక్షానికి పరిమితమైంది. ఇక్కడ టీడీపీ వరుసగా రెండోసారి విజయం సాధించడంతో కొత్త సెంటిమెంట్ కొనసాగింది.

అలిపిరి ఘటనతో సానుభూతి.. కేంద్రంలో వాజ్ పేయి ప్రభుత్వం వెలిగిపోతోందని 2004లో చంద్రబాబు మరోసారి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. 89లో ముందస్తు అనుభవం ఉన్నా లెక్క చేయకుండా ముందుకెళ్లారు. కానీ చంద్రబాబు అంచనాలు తప్పాయి. కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పడిన మహాకూటమి షాకిచ్చింది. 2001లో ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర సమితి అప్పటికే ప్రధాన రాజకీయ శక్తిగా మారింది. టీడీపీని ఓడించేందుకు టీఆర్ఎస్ తో కలిసి కాంగ్రెస్ పోటీ చేసింది. ఓ రకంగా 2004లో కాంగ్రెస్ సారధ్యంలో మహాకూటమి ఏర్పడింది. కాంగ్రెస్ 185 సీట్లు టీఆర్ఎస్ 26 స్థానాలు గెలుపొందింది. సీపీఐ 9 సీపీఎం 6 సీట్లు కైవసం చేసుకున్నాయి. బీజేపీ టీడీపీ మిత్రపక్షంగా పోటీచేసి రెండు సీట్లకు పరిమితమయ్యాయి. వరుసగా 94 – 99లో రెండుసార్లు అధికారంలోకివచ్చిన టీడీపీ 2004లో 47 సీట్లతో ప్రతిపక్షానికి పరిమితమైంది. వైయస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ మహాకూటమి విజయం సాధించింది. చంద్రబాబు ముందస్తు వ్యూహం బెడిసికొట్టింది.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.