భర్త చేతిలో గులాబీ.. భార్య చేతిలో చీపురు..

పెళ్లయి ఏడాదయింది. మామగారిచ్చిన స్కూటర్, వాళ్లావిడ ప్రేమతో కొనిచ్చిన హెల్మెట్ పెట్టుకుని రోజూ ఆఫీస్‌కి వెళ్లొస్తున్నాడు లక్నోకు చెందిన సికిందర్. పెళ్లయిన కొత్త కావడంతో రోజూ ఆఫీస్‌నుంచి త్వరగా వచ్చి భార్యని ఎక్కడికో ఒక చోటకు తీసుకు వెళుతుండేవాడు. చల్లని సాయింత్రాలను సరదాగా గడిపేస్తున్నాడు.

ఆఫీసు, ఇల్లు ఆనందంగా గడిచిపోతోంది వారి సంసారం. అనుకోకుండా ఓ రోజు గులాబీ పువ్వుని తీసుకొని వస్తూ.. గుమ్మంలో నిలబడిన భార్యకి కనిపించాడు. అతడి చేతిలోని పువ్వు.. భర్త  మొహంలో ముసి ముసి నవ్వులు కూడా కనిపించే సరికి భార్యకి కోపం, దానికి తోడు అనుమానం. వెరసి అతడిని అక్కడే దులిపేసింది. ఎవరిచ్చారాపువ్వు.. ఏమా కథ అంటూ ఆరా తీసింది. ఆఫీసు నుంచి వస్తుంటే ఓ పోలీస్ నా సిన్సియారిటీకి మెచ్చి.. అంటే హెల్మెట్ పెట్టుకుని బండి నడుపుతున్నానని గులాబీ ఇచ్చారు అని చెప్పాడు.

పోలీస్ గులాబీ ఇవ్వడమేంటి నేను నమ్మను గాక నమ్మను అనేసరికి సికిందర్‌కి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. వెంటనే ఇప్పుడే వస్తాను ఉండు అని గులాబీ ఇచ్చిన పోలీస్ దగ్గరికి మళ్లీ వెళ్లాడు. సార్.. ఇదీ పరిస్థితి అని తన భార్య అనుమానంతో తనను నిలదీసిన విషయం చెప్పాడు. నాతో సెల్ఫీ దిగి పుణ్యం కట్టుకోండి. లేకపోతే నా సంసారం రోడ్డున పడేలా ఉంది అనేసరికి పోలీస్ కరిగిపోయి సికిందర్‌తో సెల్ఫీకి ఫోజ్ ఇచ్చారు. అది తీసుకెళ్లి భార్య‌కి చూపించి నా మనసులో నువ్వు తప్ప ఎవరూ లేరు సఖీ అని ఆప్యాయంగా భార్యని దగ్గరికి తీసుకున్నాడు.