యువతిపై ఎస్ఐ కొడుకు అరాచకం

woman, beaten, harassing

ఢిల్లీలో దారుణం జరిగింది. ఓ పోలీసు అధికారి కుమారుడు ఓ యువతిని విపరీతంగా కొట్టాడు. తన తండ్రికి ఉన్న అధికారాన్ని అడ్డంపెట్టుకుని చెలరేగిపోయాడు. మద్యం మత్తులో ఉన్న అతను బాధిత అమ్మాయి వేడుకుంటున్నా కనికరించలేదు. చేతులతో, కాళ్లతో ఇష్టమొచ్చినట్లు కొట్టాడు. ఢిల్లీలో ఎస్ఐగా పనిచేస్తున్న అశోక్ కుమార్ తనయుడు రోహిత్ ఈ దారుణానికి తెగబడ్డాడు. బూతులు తిడుతూ ఆ యువతిని దారుణంగా హింసించాడు. ఓ కాల్ సెంటర్ కార్యాలయంలో జరిగిన ఈ దాడి దృశ్యాలను ఒకరు సెల్‌ఫోన్‌లో రికార్డు చేశారు.

నిందితుడిపై ఐపీసీ సెక్షన్‌ 354, 506 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా బాధిత యువతి ఢిల్లీలోని తిలక్‌ నగర్‌లో గల ఓ బీపీఓలో పనిచేస్తోంది. ఆఫీసులో ఎవరూ లేని సమయంలో స్నేహితులతో సహా అక్కడికి చేరుకున్న రోహిత్‌.. తనను పెళ్లి చేసుకోవాలంటూ ఆమెపై దాడికి పాల్పడ్డాడు.

ఈ వీడియోను రోహితే స్వయంగా తన మాజీ ప్రియురాలు జ్యోతిశర్మకు పంపించాడు. ‘నీకూ ఇదే గతి పడుతుందంటూ’ హెచ్చరించాడు. ఏడాదిన్నరపాటు రోహిత్‌తో డేటింగ్ చేసిన జ్యోతి కొద్ది నెలలుగా అతనికి దూరంగా ఉంటోంది. రోహిత్ వ్యక్తిత్వం మంచిది కాదని తెలియడంతో ఆమె దూరం పెట్టింది. దాంతో తనను పెళ్లి చేసుకోవాలంటూ రోహిత్ బెదిరింపులకు దిగాడు. తన క్రూరత్వాన్ని తెలిపేందుకు ఈ వీడియో పంపాడు. భయపడిపోయిన యువతి పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేసింది. దాంతో పోలీసులు ఐపీసీ 354, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే పోలీసులు రోహిత్‌ను కాపాడేందుకు ప్రయత్నం చేస్తున్నారని జ్యోతి ఆరోపించింది. తాను పీఎస్‌కు వెళ్లినప్పుడు లాకప్‌లో రోహిత్ లేడని ఆమె ఆరోపించింది. రోహిత్ తండ్రి ఎస్ఐ కావడంతో పోలీసులు అతని పట్ల ఉదారంగా వ్యవహరిస్తున్నారంటూ ఆమె ఆరోపించింది.