పట్టింది వదలట్లేదు.. జలగ కాదు.. అదృష్టం.. ఏకంగా రెండు లాటరీలు మరి..

ఏవిట్రా ఈ కష్టాలు.. ఒకటి పోతే ఒకటి.. కనీసం తేరుకునే సమయం కూడా చిక్కట్లేదు. ఎలా చెయ్యాలి.. నా వల్ల కావట్లేదు. ఈ కష్టాలనుంచి గట్టెక్కే మార్గం ఉంటే చెప్పరా బాబు.. అని స్నేహితుడిని అడిగాడు ఆఫ్రికా పశ్చిమ ప్రాంతానికి చెందిన మెల్హిగ్ అనే 28 ఏళ్ల యువకుడు. వయసు చిన్నదే కానీ బాధ్యతలు చాలా ఎక్కువ. సరైన ఉద్యోగం లేదు. కష్టాలు గుమ్మంలోనే కాపలా కాస్తున్నాయి. స్నేహితుడి సలహాతో ఈ ఏడాది ఏప్రిల్‌లో ఓ లాటరీ టికెట్ కొన్నాడు. దానికి 1.5 మిలియన్ డాలర్లు బహుమతిగా గెలుచుకున్నాడు.. మన కరెన్సీ ప్రకారం రూ.10 కోట్లు పైనే.. ఇక మెల్హిగ్ ఆనందానికి అవధుల్లేవ్. నా కష్టాలన్నీ తీరిపోయాయోచ్ అని ఎగిరి గంతేశాడు. కావలసినవన్నీ సమకూర్చుకున్నాడు. ‌

ఈ క్రమంలో మరో టికెట్ కొనాలన్న ఆలోచన వచ్చింది. తన అదృష్టాన్ని ఇంకోసారి పరీక్షించుకోవాలనుకున్నాడు. మళ్లీ లాటరీ తగిలింది. ఈ సారి ప్రైజ్ మనీ కూడా పెరిగింది 2 మిలియన్ డాలర్లు (రూ.14 కోట్లకు పైనే) వచ్చి చేరాయి. ఇది కల కాదు కదా అని ఆశ్చర్య పోతున్నాడు. మరి మొదటి సారి లాటరీ కొన్నప్పుడు 9 లక్షల మంది పోటీ పడితే అందులో తాను ఒకడయ్యాడు. రెండో సారి లాటరీ కొన్నప్పుడు 13 లక్షల మంది పాల్గొంటే 2 మిలియన్ డాలర్లు తెచ్చిపెట్టింది. అదృష్టం అలా జలగలా పట్టుకుంది మెల్హిగ్‌ని. రెండు సంవత్సరాల కిందట కెనడాకు వలస వచ్చిన మెల్హిగ్‌కి చేతిలో చిల్లి గవ్వలేదు. ఇప్పుడు కోట్లకు అధిపతి అయ్యాడు. అంతే.. ఒక్కోసారి అదృష్టం అలా తలుపు తడుతుంటుంది. అలా అని వేచి వుండకుండా తమపని తాము చేసుకుంటూ కష్టాన్నే నమ్ముకుంటే అదృష్టం ఏ రూపంలో అయినా వస్తుంది.