కొండగట్టు ప్రమాదంలో వెలుగులోకి సంచలన వాస్తవాలు

కొండగట్టు బస్సు ప్రమాదం కేసులో సంచలన వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. భారీగా ప్రాణాలు గాలిలో కలిసి పోవడానికి ముమ్మాటికి మానవ తప్పిదమే కారణమని తేలింది. మరోవైపు.. కొండగట్టు ప్రమాదం చుట్టూ రాజకీయ రంగు పులుముకుంది. మృతుల అంతిమక్రియల్లో పాల్గొన్న రాజకీయ నేతలు… ప్రభుత్వమే లక్ష్యంగా విమర్శలు గుప్పించారు.

కొండగట్టు బస్సు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 62కు పెరిగింది. కరీంనగర్ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు ప్రాణాలు విడిచారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 40మందిలో మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. వారికి వైద్యులు అత్యవసర చికిత్సను అందిస్తున్నారు.

కొండగట్టు ప్రమాదం ముమ్మాటికీ మానవ తప్పిదమేనని తేలింది. బస్సు ప్రమాదంపై విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు కళ్లుబయర్లు కమ్మే వాస్తవాలను బయటపెట్టారు. బస్సు ఫిట్‌నెస్ లేకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని తెల్చారు. గుట్టపై నుంచి దిగుతున్న క్రమంలో బస్సు బ్రేక్ ఫెయిల్ అయినట్లు నిర్ధారించారు. బస్సు స్టీరింగ్ విరిగిపోవడంతో.. అదుపుతప్పి లోయలోకి పల్టీలు కొట్టిందన్నారు. బస్సు జీవిత కాలం 12లక్షల కిలోమీటర్లు కాగా.. ప్రమాదానికి గురైన బస్సు 14లక్షల కిలోమీటర్లు తిరిగినట్లు గుర్తించారు. స్క్రాప్ కింద మూలన పడేయాల్సిన బస్సును.. డబ్బుల కోసమే నడుపుతున్నట్లు విచారణలో తేల్చారు. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం కూడా ప్రమాదానికి ఓ కారణంగా విచారణ అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

కొండగట్టు బస్సు ప్రమాదం చుట్టూ.. రాజకీయాలు ముసురుతున్నాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బస్సు ప్రమాద బాధితులను మంత్రి ఈటెల రాజేందర్, ఎంపీ వినోద్ పరామర్శించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

62మందిని పొట్టన పెట్టుకున్న పాపం టీఆర్ఎస్ పార్టీదేనని టీ పీసీపీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. బస్సు ప్రమాదం ముమ్మాటికి ప్రభుత్వ తప్పిదమే అన్నారు. కొండగట్టు ప్రమాద స్థలాన్ని కాంగ్రెస్ నేతలతో కలిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. తరువాత మృతుల అంత్యక్రియల్లో పాల్గొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వల్లే ప్రమాదం జరిగిందని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. బాధిత కుటుంబాలకు పరిహారం 50 లక్షలివ్వాలని డిమాండ్ చేశారు. బాధితులకు అండగా ఉంటామంటూ భరోసా ఇచ్చారు.

62మంది చనిపోయినా.. ప్రభుత్వం సరిగా స్పందించకపోవడం బాధాకరమన్నారు టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌ కు మృతుల కుటుంబాలాను ఓదార్చే సమయం లేకపోవడం దురదృష్టకరమన్నారు.

12 పల్లెల్లో తీరని విషాదాన్ని నింపిన కొండగట్టు ఘటన రాజకీయ అస్త్రంగా మారింది. బాధితుల గోడుకు మించి రాజకీయ గోడు పెరిగింది.