ప్రముఖ దర్శకుడు కన్నుమూత

ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు కేఎన్‌టీ శాస్త్రి కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.శాస్త్రి వివిధ విభాగాల్లో 12 అంతర్జాతీయ, 7 జాతీయ అవార్డులను గెలుచుకున్నారు. పాత్రికేయుడుగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన కేఎన్‌టీ సినీ దర్శకుడుగానే కాకుండా విమర్శకుడిగా, రచయితగా ప్రసిద్ధి చెందారు. ఇప్పటి వరకు పది చిత్రాల వరకు నిర్మించారు. తిలదానం, కమిలి తదితర సినిమాలకు శాస్త్రి దర్శకత్వం వహించారు. అలాగే శాస్త్రి దర్శకత్వం వహించిన సురభి నాటకం డాక్యుమెంటరీకి నేషనల్ అవార్డు వచ్చింది. శాస్త్రి దర్శకత్యం వహించిన కమిలి చిత్రం దక్షిణ కొరియాలోని బూసాన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌తో పాటు మరో పది దేశాల్లో ప్రదర్శించారు.
ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ నటీ నందితా దాస్ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాను కర్ణాటక ప్రభుత్వం ఉత్తమ చిత్రం అవార్డుకు ఎంపిక చేసింది. ఈ చిత్రంలో నందిత నటనకు గాను ఉత్తమ నటిగా అవార్డు గెలుచుకుంది. అమ్మాయిల అక్రమ రవాణ కథాంశంగా చేసుకొని ‘హార్వెస్టింగ్ బేబీ గర్ల్’ అనే డాక్యుమెంటరీని తీశారు. ఆమ్‌స్టర్ డ్యామ్ లో జరిగిన డాక్యుమెంటరీ ఫిలిం ఫెస్టివల్ లో ఇది ఆడియెన్స్ అవార్డును గెలుచుకుంది.