శంషాబాద్‌లోని ఫామ్‌హౌజ్‌లో భారీ చోరీ.. రూ. 50 లక్షలు..

హైదరాబాద్ శివారు శంషాబాద్ లో భారీ దోపిడి జరిగింది. ధర్మగిరి రోడ్డులోని ఓ ఫామ్ హౌజ్ లో 50 లక్షల మేర నగదు, నగలను దోచుకెళ్లారు. కిటికి గ్రిల్స్ తొలగించి చోరీకి తెగబడ్డారు దొంగలు. చోరీ జరిగిన తర్వాత ఫామ్ హౌజ్ లో పనిచేసే కొందరు ఒరిస్సా యువకులు పరారీలో ఉన్నారు. దీంతో వాళ్లే దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

చోరీ జరిగిన ఫామ్ హౌజ్ శంషాబాద్ సరితా ఫామ్ హౌజ్ కు కూత వేటు దూరంలోనే ఉంది. ప్రసాదరావు, రాజ్యలక్ష్మీలకు చెందిన ఈ ఫామ్ హౌజ్ లో వారం రోజుల క్రితమే ఐదుగురు ఒరిస్సా కుర్రాళ్లు పనిలో చేరారు. రాత్రి ప్రసాదరావు దంపతులు ఇద్దరు నిద్రపోయాక కిటీకి గ్రిల్స్ తొలగించిన దుండగులు.

బీరువాలో దాచిన బంగారు నగలు, నగదు ఎత్తుకెళ్లారు. ఉదయం చోరీ విషయాన్ని గుర్తించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ తో కొన్ని కీలకమైన ఆధారాలు లభించినట్లు పోలీసులు చెబుతున్నారు. చోరీకి పాల్పడిన వాళ్లను త్వరలోనే పట్టుకుంటామని అన్నారు పోలీసులు. చోరీ జరిగిన తర్వాత నుంచి కనిపంచకుండా పోయిన ఒరిస్సా కుర్రాళ్ల కోసం గాలింపు చర్య ప్రారంభించారు పోలీసులు.