నాన్నా.. నన్నెందుకు చంపుతావు.. నాదా తప్పు.. మళ్లీ ఆడపిల్లని..

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని పెర్దోలి గ్రామానికి చెందిన గాంగ్వర్‌కి అప్పటికే రెండేళ్ల కావ్య ఉంది. మళ్లీ రెండో కాన్పులో అమ్మాయి పుట్టిందన్న విషయం తెలిసింది. అంతే.. ఆగ్రహంతో తన దగ్గరే ఉన్న రెండేళ్ల కూతుర్ని తీసుకుని ఆసుపత్రి రెండో అంతస్థు పైకి చేరుకున్నాడు. మద్యం మత్తు, మళ్లీ ఆడపిల్ల పుట్టిందన్న ఆవేదన. రెండూ కలిసి విచక్షణ కోల్పోయేలా చేశాయి అతడిని. పై అంతస్థుకు తీసుకు వెళ్లిన కావ్యను అక్కడి నుంచి కిందకు తోసేసాడు. అనంతరం ఎవరికీ చిక్కకుండా పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన పాప పరిస్థితి విషమంగా ఉంది. వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు.

నాన్నా అని పిలిపించుకోవాలంటే అమ్మ ఆ బిడ్డని నవమాసాలు మోయాలి. కష్టమైనా ఎంతో ఇష్టంగా మోస్తుంది. పుట్టింది పాపైనా, బాబైనా ఆత్రంగా గుండెలకు హత్తుకుంటుంది. మరి నాన్నకెందుకు అమ్మాయి పుట్టింది అనగానే మొహంలో నెత్తురు చుక్క ఉండదు. అబ్బాయంటేనే అంతిష్టం ఎందుకు. అమ్మాయిగా పుట్టడానికి ఆమెనా బాధ్యురాలు. ఇంకెప్పుడు నాన్న తెలుసుకుంటాడు. అమ్మాయిని, అబ్బాయిని ఒకేలా చూసే రోజు ఇంకెప్పటికి వస్తుంది. ఓ ఆడబిడ్డ ఆవేదన.