పాలమూరు వేదికగా టీఆర్‌ఎస్‌ పాలనపై బీజేపీ యుద్ధభేరి

తెలంగాణలో కాషాయదళం ఎన్నికల శంఖం పూరించేందుకు సిద్ధమైంది. బీజేపీ చీఫ్‌ అమిత్‌షా ఇవాళ ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టబోతున్నారు. పాలమూరు వేదికగా టీఆర్‌ఎస్‌ పాలనపై యుద్ధభేరి మోగిస్తారు. ఒక్కరోజు సుడిగాలి పర్యటనలో ఎన్నికల వ్యూహాలు, అభ్యర్థుల ఎంపికపై రాష్ట్ర నాయకత్వానికి దిశానిర్దేశం చేస్తారు.

తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు సమరశంఖం పూరిచేందుకు కాషాయదళం సన్నద్ధమైంది. ఇవాళ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా.. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టబోతున్నారు.

ఉదయం పదకొండున్నరకు అమిత్‌షా ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. పార్టీ చీఫ్‌కు ఘనస్వాగతం పలికేందుకు బీజేపీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. ఎయిర్‌పోర్ట్‌ నుంచి నాంపల్లిలోని పార్టీ ఆఫీస్‌కు చేరుకుని.. రాష్ట్రంలోని శక్తి సంఘాలతో సమావేశం అవుతారు. ఎన్నికల మేనిఫెస్టోకు సంబంధించిన కమిటీలు, ఎన్నికలకు ఎలా సమయాత్తం అవ్వాలన్న దానిపై నాయకత్వానికి దిశానిర్దేశం చేయనున్నారు. అక్కడే మీడియా సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం ఒకటిన్నర తర్వాత లాల్‌దర్వాజా మహంకాళి ఆలయానికి వెళ్లి పూజలు నిర్వహించారు. అక్కడ్నుంచి రోడ్డుమార్గం ద్వారా మహబూబ్‌నగర్‌లోని ఎన్నికల శంఖారావం సభకు బయల్దేరి వెళ్లనున్నారు. ఈ బహిరంగ సభలో టీర్‌ఎస్‌ నాలుగున్నరేళ్ల ప్రజావ్యతిరేక పాలన, కేంద్ర ప్రభుత్వం రాష్ర్ట ప్రభుత్వానికి కేటాయించిన నిధులు, కేంద్రం ప్రవేశ పెట్టిన పథకాలను వివరించనున్నారు. ఈ బహిరంగ సభ నుంచే అమిత్‌ షా ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. అనంతరం కొత్తూరు చేరుకుని బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశంలో పాల్గొంటారు. రాత్రి తొమ్మిది గంటలకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ చేరుకుని.. ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయల్దేరి వెళ్తారు.

ఇవాళ్టి సభలో బీజేపీలో చేరికలు ఉండబోవని రాష్ర్ట నాయకత్వం స్పష్టం చేసింది. పార్టీలోకి వచ్చేందుకు అన్ని పార్టీల నుంచి సంప్రదింపులు జరుపుతున్నారని.. బహిరంగ సభ తరవాత మరోసారి అమిత్‌ షా హైదరాబాద్‌కు వస్తారని అప్పుడు చేరికలు ఉంటాయని తెలిపారు. జిల్లాల వారీగా పార్టీలో చేరికలు ఉంటాయని రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ చెబుతున్నారు.

మరోవైపు తెలంగాణ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించిన కమలనాథులు.. ఈనెల 20లోగా అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. మహబూబ్‌నగర్‌లో అమిత్‌షా పర్యటన తర్వాత అభ్యర్థుల లిస్ట్‌ రిలీజ్‌ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. 30 నుంచి 35 మంది అభ్యర్థుల పేర్లను ఇందులో చేరనున్నారు. వీరిలో 10 మందిని గ్రేటర్‌ హైదరాబాద్‌ నుంచి ఖరారు చేస్తారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.