తెలంగాణ ఎడారిగా మారుతుందన్న ఆవేదనతోనే ఆ రోజు బాబ్లీపై పోరాటం

ఉత్తర తెలంగాణ ఎడారిగా మారుతుందన్న ఆవేదనతోనే బాబ్లీపై పోరాటం చేశానని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అంతకుమించి తానేమి నేరాలు, ఘోరాలు చేయలేదన్నారు. శ్రీశైలం, సాగర్‌లో కృష్ణమ్మకు జలహారతి ఇచ్చిన చంద్రబాబు.. నదుల అనుసంధానంతో రాష్ట్రంలో నీటి కొరత లేకుండా చేస్తున్నామని చెప్పారు.’

ప్రకృతితో మమేకం.. నీటి వనరుల ప్రాధాన్యం తెలిపేలా ఏపీ ప్రభుత్వం చేపట్టిన జలహారతి వైభవంగా ప్రారంభమైంది. మూడ్రోజుల పాటు నదీమా తల్లికి హారతి ఇవ్వనున్నారు. తొలిరోజున శ్రీశైలం, నాగార్జున సాగర్‌లో కృష్ణా నదికి ఏపీ సీఎం చంద్రబాబు జలహారతి ఇచ్చారు.

శ్రీశైలం దగ్గర కృష్ణానదికి జలహారతి ఇచ్చిన సీఎం.. శ్రీభ్రమరాంబ మల్లిఖార్జునస్వామిని దర్శించుకున్నారు. అనంతరం సున్నిపెంట సభలో పాల్గొన్న బాబు.. ఏపీలో ప్రతి ఒక్కరికి నీటి భద్రత ఇవ్వడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా గోదావరి, కృష్ణా నదులను కలిపామంటే.. అది ఒక్క టీడీపీ ప్రభుత్వానికే సాధ్యమైందన్నారు.

రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు నీరు అందేలా ప్రభుత్వం చేస్తున్న కృషిని చంద్రబాబు వివరించారు. పట్టిసీమతో నీటి సమస్యలను అధిగమిస్తున్నామన్నారు. వచ్చే జనవరి నాటికి 46 ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పారు. ఈ నెలలో 12, అక్టోబర్‌లో 3, డిసెంబర్‌లో 8 ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టుకు కేంద్రం డబ్బులు ఇవ్వకపోయినా పనులు ఆపకుండా కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నామన్నారు చంద్రబాబు.

ఇక.. బాబ్లీ కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్‌ జారీ కావడంపై సీఎం స్పందించారు. తాను నేరాలు, ఘోరాలు, అన్యాయాలు చేయలేదన్నారు. ఉత్తర తెలంగాణ ఎడారిగా మారిపోతుందనే ఆవేదనతోనే బాబ్లీకి వ్యతిరేకంగా పోరాడానని గుర్తు చేశారు.

శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌ చేరుకున్న చంద్రబాబు.. అక్కడ కృష్ణా జలాలకు హారతి ఇచ్చారు. అనంతరం అనుపు కొప్పునూరు ఎత్తిపోతల ప్రారంభోత్సవంలో పాల్గొని శిలాఫలకాలు ఆవిష్కరించారు.