నా పెళ్ళి దానితోనే.. కాదంటే చచ్చిపోతా..

ఆమె ఓ అందగత్తె.. ఆమెని చూస్తే ఇష్టపడని అబ్బాయిలు ఉండరు. స్వయంవరం ప్రకటిస్తే క్యూలో నిలబడి మరీ ఆమెకోసం యువకులు పోటీ పడతారు. కానీ ఆమె మనసు ఆమె దగ్గర లేదు. మరొకరికి ఇచ్చేసింది. తన కళ్ల ముందు ఎంతమంది రాకుమారులు ఉన్నా ఆమె మనసు దోచుకున్న వారితోనే పెళ్ళి చేసుకుంటానంటుంది. పెళ్ళికి కూడా రెడీ అయింది.. ముహూర్తం కూడా ఖరారు చేసింది. సెప్టెంబర్ నెలలోనే వారి వివాహానికి రింగ్ లు కూడా సిధ్ధం చేసుకుని రెడీగా పెట్టుకుంది. ఇంతకీ ఆమె పెళ్ళి చేసుబోతున్నది ఎవర్నో తెలుసా.. యువకుడిని కాదు.. మరో యువతిని చేసుకుంటుందని పొరబడతారేమో.. కానీ ఆమె మరో యువతిని కూడా చేసుకోవటం లేదు.. మరి ఈ అందాల సుందరి చేసుకునేది ఎవర్నా అని ఆలోచిస్తున్నారా.. ఓ రాక్షస బొమ్మని.. అవును మీరు చదువుతున్నది నిజమే.. చూడటానికి వణుకు పుట్టించేలా, వికృతంగా ఉన్న ఓ రాక్షస బొమ్మను ఈ యువతి వివాహం చేసుకోనుంది.

అమెరికాలోని మాసాచుసెట్స్‌కు చెందిన ఫెలిసిటీ అనే యువతి తనకెంతో ఇష్టమైన ఈ రాక్షస బొమ్మను సెప్టెంబరులో వివాహం చేసుకోబోతున్నట్లు తనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. అంతే ఈ బొమ్మను చూసిన నెటిజన్లు దెబ్బకు భయంతో బెంబేలెత్తిపోయారు. తనకు 13 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు ఆ బొమ్మను చూసి ముచ్చటపడిందట ఫెలిసిటీ. దాంతో ఆమె బంధువులు ఆ బొమ్మను కొని ఆమెకు బహుమతిగా ఇచ్చారు. ఇక అప్పటినుంచీ ఆమె ఆనందానికి అవధుల్లేవు. ఎక్కువ సేపు ఆ బొమ్మతోనే గడిపేది. చాలా కబుర్లు చెప్పుకునేది. ఆ బొమ్మకు ముద్దుగా కెల్లీ అని పేరు పెట్టి మనిషితో సమానంగానే భావించేది. తన మనసులోని ఊసులు, ఊహలు అన్నీకెల్లీతోనే. ఇక బొమ్మని ఎంతలా ఇష్టపడిందంటే.. ఆ బొమ్మ పేరును పచ్చబొట్టు పొడిపించుకునే అంతలా.. తాజాగా తన జీవితాన్ని కూడా ఆ రాక్షస బొమ్మతోనే పంచుకోవడానికి సిద్ధపడింది ఈ చూడచక్కని ముద్దుగుమ్మ. తల్లిదండ్రులు నీకు ఇదేం పిచ్చి అంటూ మొదటి నుంచి ఈ పెళ్లిని వ్యతిరేకిస్తున్నారు. కానీ పెళ్లంటూ చేసుకుంటే కెల్లీని చేసుకుంటా.. లేదంటే చచ్చిపోతానంటుంది. ఇక చేసేది ఏమిలేక నీ కర్మంటూ వదిలేశారు. అయితే ఈ అమ్మడు తన వివాహానికి ఉంగరాలు కూడా కొని.. ఈ రాక్షస బొమ్మతో ఒక్కటయ్యే తరుణం కోసం క్షణమొక యుగంగా గడుపుతోంది.