టీటీడీపీ కొత్త ఫార్ములా…దేవేందర్ గౌడ్‌కు…

తెలంగాణ టీడీపీలో సీనియర్ నేతలు ఓ కొత్త ఫార్ములా కనిపెట్టారు. మహకూటమిగా మారి ఎన్నికల రంగంలోకి దిగుతున్న నేతలు… పొత్తులో భాగంగా తమకు పెద్దగా సీట్లు దక్కవని భావిస్తున్నారు. అందుకే పక్క ప్లానింగ్ తో గెలుపునకు అవకాశమున్న స్ధానాలవైపే చూస్తున్నారు. టికెట్ దక్కించుకుకొనేందుకు జిల్లాలు దాటి గ్రేటర్ లో స్థానాలపై దృష్షిసారిస్తున్నారు కొందరు టీటీడీపీ నేతలు.

తెలంగాణ మొత్తం మీద టీడీపీ కి కొద్దోగొప్ప బలమున్నది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే. గత ఎన్నికలలో గ్రేటర్ లో సత్తా చాటిన ఆపార్టీ ఈసారి కూడా ఇక్కడే ఆశ పెట్టుకుంది . పార్టీకి బలమైన నియోజకవర్గాలైన కూకట్ పల్లి, శేరిలింగం పల్లి, జూబ్లీహిల్స్, కుత్భుల్లాపూర్, ఉప్పల్, మహేశ్వరం, ఎల్ బీ నగర్ లాంటి స్థానాలపై చాలా మంది టీడీపీ నేతలు ఆశలు పెట్టుకున్నారు. గ్రేటర్ లోని నేతలు గత కొంత కాలం నుండి ఈ నియోజకవర్గాలలో పనిచేసుకుపోతుంటే… తాజాగా పొత్తుల దెబ్బతో సీనియర్ నేతలు గ్రేటర్‌కు దిగుమతి అవుతుండటంతో.. ఆశావాహుల గుండెల్లో గుబులు రేగుతోంది

నిజామాబాద్ కు చెందిన పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు జూబ్లీహిల్స్ స్ధానం ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. నిజామాబాద్ రూరల్ నుండి మండవ పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతున్నప్పటికి అక్కడి కంటే గ్రేటర్ సేఫ్ అని ఆయన భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక మరో సీనియర్ నేత పెద్దిరెడ్డి కూడా గ్రేటర్ నుండి పోటీచేయాలని చూస్తున్నారు. కూకట్ పల్లి స్ధానం ఆశిస్తున్న ఆయన ట్రేడ్ యూనియన్ నేతగా అటు సనత్ నగర్ తోపాటు సిటీలోని కొన్ని నియోజకవర్గాలలో తనకున్న కేడర్ కలిసివస్తుందని లెక్కలేస్తున్నారు. వాస్తవానికి ఆయన హుస్నాబాద్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది .ఐతే పార్టీ తన పోటీ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకున్నా తనకు సమ్మతమేనంటున్నారు పెద్దిరెడ్డి .

గ్రేటర్ లో పలు సార్లు టికెట్ ఆశించి భంగపడ్డ మరోనేత అరవింద్ గౌడ్ ఈసారి ఆరునూరైన బరిలోకి దిగాలని చూస్తున్నారు . శేరిలింగంపల్లి ఆశిస్తున్న ఆయన తన అదృషాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నారు. ఐతే ఇటీవలే తిరిగి పార్టీలో చేరిన నేత మొవ్వ సత్యనారాయణతో పాటు చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన మరో ఇద్దరు నుండి టికెట్ కోసం గట్టి పోటీ ఎదురవుతోంది. కాంగ్రెస్ తో అలయన్స్ లో భాగంగా పక్క పక్క నియోజకవర్గాలైన కూకట్ పల్లి , శేరిలింగంపల్లి నియోజకవర్గాలు రెండిటిని టీడీపీకి ఆపార్టీ వదులుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

కొంతకాలంగా పోటీకి దూరంగా ఉంటూ వస్తున్న దేవేందర్ గౌడ్ కూడా ఈసారి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. మహేశ్వరం స్ధానం నుంచి దేవేందర్ గౌడ్, ఆయన తనయుడు వీరేందర్ గౌడ్ ఉప్పల్ నుండి పోటీ చేసే అవకాశం ఉంది. మహకూటమి పొత్తు దెబ్బతో మొత్తం మీద టీటీడీపీ పెద్దతలకాయలకు తప్ప మిగిలిన నేతలు టికెట్లు దక్కే అవకాశం కనిపించడంలేదు.