నష్టాలతో ట్రేడవుతున్న మార్కెట్లు..!

చైనా దిగుమతులపై సుంకాల విధింపునకు అమెరికా ప్రభుత్వం సన్నద్ధమవుతున్న వార్తలతో ఆసియా స్టాక్ మార్కెట్లు ప్రతికూలంగా ప్రారంభమయ్యాయి. జపాన్‌ మార్కెట్‌కు సెలవుకావడంతో లిక్విడిటీ మందగించగా.. తుఫాన్‌ కారణంగాహాంకాంగ్‌, చైనాలోని గువాంగ్‌డాంగ్‌ ప్రాంతాలు విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. కాగా.. నేడు ట్రంప్‌ ప్రభుత్వం 200 బిలియన్‌ డాలర్ల విలువైన చైనా దిగుమతులపై కొత్త టారిఫ్‌ల విధింపును ప్రకటించనున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. 10-25 శాతం మధ్య టారిఫ్‌లను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. అయితే ట్రంప్‌ ప్రభుత్వం టారిఫ్‌లను ప్రకటిస్తే.. ఈ నెలాఖరున వాణిజ్య చర్చలకు రమ్మంటూ అమెరికా ప్రభుత్వం ప్రకటించిన ఆహ్వానాన్ని చైనా అధికార వర్గాలు తిరస్కరించే వీలున్నట్లు మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన అమెరికా, చైనా మధ్య తిరిగి వాణిజ్య వివాదాలు తలెత్తే అంచనాలు బలపడ్డాయి. ఫలితంగా ప్రపంచస్థాయిలో ఇన్వెస్టర్లు ఆందోళనకు లోనవుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆసియా మార్కెట్లలో ప్రస్తుతం అమ్మకాలదే పైచేయిగా కనిపిస్తోంది.

నష్టాలతో
టెక్నాలజీ, ఇండస్ట్రియల్‌ దిగ్గజాల అండతో గురువారం డోజోన్స్‌ సరికొత్త గరిష్టానికి చేరువలో ముగిసింది. కాగా.. ప్రస్తుతం ఆసియాలో జపాన్‌ మార్కెట్లకు సెలవుకాగా.. మిగిలిన మార్కెట్లన్నీ నష్టాలతో ట్రేడవుతున్నాయి. హాంకాంగ్‌ 1.65 శాతం పతనంకాగా.. ఇండొనేసియా, చైనా, కొరియా, సింగపూర్‌, తైవాన్‌, థాయ్‌లాండ్‌ 1-0.2 శాతం మధ్య నీరసించాయి. కాగా.. ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు స్వల్పంగా బలపడి 94.94కు చేరగా.. యూరో 1.172 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో మారకంలో జపనీస్‌ యెన్‌ 111.95 వద్ద కదులుతోంది.