ఏపీ అంసెబ్లి: మంత్రి పరిటాల సునీతపై సభ్యుల తీవ్ర విమర్శలు

పేరుకి అంతా సీనియర్లే.. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం వారి సొంతం.. గతంలో మంత్రులుగా చేసిన అనుభవం ఉంది.. అయినా అప్పుడే బాధ్యతలు చేపట్టిన వారిలా కాస్త తడబడ్డారు.. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం లేదు.. గట్టిగా ప్రశ్నించే ప్రజా ప్రతినిధులు లేరు.. అయినా మాట్లాడేందుకు చాలా ఇబ్బంది పడ్డారు.. దాదాపు అందరి మంతృలదీ అదే పరిస్థితి.

శాసన సభలో బిల్లుల్ని ప్రవేశపెట్టే సమయంలో మంత్రులు తీవ్రంగా తడబడ్డారు. సుదీర్ఘ అనుభవం ఉన్న రెవిన్యూ మంత్రి కేఈ కృష్ణమూర్తి మొదలుకుని., పరిటాల సునీత, నారాయణ వరకు గందరగోళానికి గురయ్యారు. దీంతో అసెంబ్లీ సిబ్బంది వారికి సహకరించాల్సి వచ్చింది..

శాసన సభా సమావేశాలు ముగింపు దశకు వస్తుండటంతో మంగళవారం కీలకమైన బిల్లులు సభ ముందుకు వచ్చాయి. దాదాపు పదికి పైగా సవరణ బిల్లుల్ని శాసనసభలో ప్రవేశ పెట్టారు. ఏపీ భూయాజమాన్య హక్కులు-పట్టదారు పాస్‌ బుక్‌ చట్ట సవరణ బిల్లులో పలు లోపాలున్నాయంటూ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతిపాదిత బిల్లును మార్చాల్సిందేనని పట్టుపట్టారు. దీనికి రెవిన్యూ మంత్రి మొదట అంగీకరించారు. ఆ తర్వాత నిబంధనల రూపంలో వాటిని చేరుస్తామని చెప్పారు. సభ్యులు ప్రశ్నలు లేవనెత్తడం., మరోమారు సభ ముందుకు తీసుకురావాలని డిమాండ్ చేయడంతో కేఈ మొదట అంగీకరించినా.. తిరిగి సభ ముందుకు తీసుకురావడానికి సమయం పడుతుందనే ఉద్దేశంతో బిల్లును ఎదో ఒకలా పాస్‌ చేయించేశారు.

నిర్బంధ వివాహ నమోదు చట్టం సవరణ బిల్లు విషయంలో మంత్రి పరిటాల సునీతపై సభ్యులు తీవ్ర విమర్శలు చేశారు. మంత్రికి ప్రతిపాదిత బిల్లుపై అవగాహన లేకుండానే సభలో ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే మోదుగుల విమర్శించారు. మునిసిపాలిటీస్‌, సిఆర్‌డిఏ, మెట్రోపాలిటిన్‌ రీజియన్‌ చట్ట సవరణను కూడా సభ్యులు తప్పు పట్టారు.

సీఆర్‌డీఏ బిల్లును సభ ముందుకు ప్రతిపాదించకుండానే మంత్రి నారాయణ వివరణ ఇచ్చారు. దీంతో ముందు బిల్లు ప్రవేశపెట్టాలని స్పీకర్‌ కోడెల సూచించారు. దీంతో మంత్రి నారాయణ కాస్త గందరగోళానికి గురయ్యారు. అసెంబ్లీ సిబ్బంది సాయంతో ప్రకటన చేసినా మళ్లీ దానిని అమోదింపచేసే విషయంలో తికమక పడ్డారు. సభ్యులు చట్ట సవరణ చేయాలని డిమాండ్ చేయడం., మరోమారు ప్రవేశపెట్టాలనడంతో స్పీకర్‌ మధ్యలో వివరణ ఇచ్చారు. స్పీకర్‌ చొరవతో ప్రతిపాదిత బిల్లుల్ని మరోమారు ప్రవేశపెట్టకుండా మంగళవారమే వాటికి అమోదింప చేసుకోగలిగారు మంత్రులు. బిల్లులపై అభ్యంతరాలు లేవనెత్తిన సభ్యులు ఎవరూ డివిజన్‌కు వెళ్లాలని అడగకపోవడంతో బిల్లులకు ఆమోదం లభించింది..