ప్రణయ్‌ హత్య : స్పందించిన కౌసల్య శంకర్‌

ప్రపంచం ఎదుగుతోంది..వేగంగా పరిగెడుతోంది. కానీ భారతీయ సమాజం మాత్రం కుల,మత,వర్గం అనే అనాగరికపు చట్ర బంధంలో ఇరుక్కుపోయింది. మిర్యాలగూడలో చోటుచేసుకున్న ప్రణయ్‌ కుమార్ హత్య ఇలాంటి సంఘటనలనే గుర్తుచేస్తుంది. ప్రణయ్‌ ప్రేమకథ లాంటి విషాద గాథలు దేశంలో అనేకం. మారుతిరావు లాంటి తండ్రులు ఈ దేశంలో చాలా మంది ఉన్నారు. రెండేళ్ల క్రితం తమిళనాడులో జరిగిన దళిత యువకుడు శంకర్‌ (22) హత్య ఉదంతం కూడా ఇలాంటిదే. కౌసల్య అనే అమ్మాయిని కులాంతర వివాహం చేసుకున్నాడన్న కోపంతో శంకర్‌ను.. కౌసల్య తండ్రి కిరాయి హంతకులతో దారుణంగా చంపించాడు. అప్పట్లో ఈ పరువు హత్య దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. తాజాగా ప్రణయ్‌ హత్య ఘటనపై కౌసల్య స్పందించారు.

దేశంలో వెళ్లూనుకుపోయిన కుల వ్యవస్థ సమూలంగా నాశనం కావాలి. కులాంతర వివాహాలు చేసుకుంటే కులం నాశనమవుతుందని పెద్దలు భయపడతారు. దీంతో వారు అవమానంతో హత్యలకు పాల్పడుతున్నారు. అబ్బాయి దిగువ సామాజికవర్గానికి చెందినవాడు అయితే వారి అలోచన మరీ దారుణంగా ఉంటుంది. తమ కుమార్తె గర్భంలో మరో సామాజికవర్గానికి చెందిన బిడ్డ ఎలా పెరుగుతుందనే ఆలోచనతో వారు రగిలిపోతున్నారు. కులతత్వ సమాజం ఉన్నంత కాలం ఇలాంటి దారుణాలు జరుగుతూనే ఉంటాయి. కులతత్వాన్ని సమూలంగా నాశనం చేస్తే తప్ప, వీటికి అడ్డుకట్ట పడదని కౌసల్య చెప్పింది.

ఈ దేశంలో తమలాంటి చాలా జంటలు కులతత్వానికి బలైపోయాయని ఆవేదన చెందారు. సామాజికవర్గాన్ని కాపాడే దేవతలుగా మాత్రమే మహిళల్ని గౌరవిస్తున్నారని.. మహిళలు కేవలం పిల్లలను తయారుచేసే యంత్రాలుగా మారిపోయారని కౌశల్య బాధపడ్డారు. కులాంతర వివాహం చేసుకున్న వారికి
పోలీస్‌ స్టేషన్ల నుంచి సరైన మద్దతు లభించడం లేదన్నారు. పెరియార్, అంబేద్కర్ ఆశయాలైన కులవ్యవస్థ నిర్మూలన.. మహిళలకు విముక్తి లేకుండా సాధ్యం కాదన్నారు. సామాజిక వర్గ వివక్ష అనుభవిస్తున్నవారికే తెలుసు దాని బాధేంటో అని కౌశల్య చెప్పుకొచ్చారు.

ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త.. తన ముందే దారుణంగా హత్యకు గురి కావడంపై కౌశల్య న్యాయపోరాటం చేశారు. శంకర్‌ ను హత్య చేసిన నేరస్తులకు ఉరిశిక్షపడే వరకు కౌశల్య ధైర్యంతో పోరాడారు. ప్రస్తుతం కౌసల్య తమిళనాడులో కులనిర్మూలన కోసం పోరాటం చేస్తున్నారు.