రాహుల్ పర్యటనతో కాంగ్రెస్‌ కేడర్‌లో జోష్

ఏపీలో కాంగ్రెస్‌ బలోపేతమే లక్ష్యంగా జరిగిన రాహుల్ పర్యటన కేడర్ కు కొత్త జోష్ తీసుకొచ్చింది. ఏపీ రాజకీయాల్లో మెయిన్ ఇష్యూగా మారిన ప్రత్యేక హోదాపై భరోసా ఇస్తూనే.. విభజన హామీల్లో అన్నింటిని నేరవేరుస్తామన్నారు. మోడీ దగా చేసిన తీరును వివరిస్తూ.. బీజేపీతో కాంగ్రెస్ కు ఉన్న బేధాన్ని ప్రజలకు చాటారాయన. తమ అంచనాలకు తగ్గట్లు రాహుల్ కర్నూలు పర్యటన సక్సెస్ కావటంతో ఏపీ కాంగ్రెస్ లో ఉత్సాహం నెలకొంది.

రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ చతికిలబడిపోయింది. 2014లో పార్టీని పూర్తిగా తిరస్కరించారు ప్రజలు. దీంతో కొన్నాళ్లు స్తబ్ధుగా ఉన్న కాంగ్రెస్… ఎలక్షన్ సీజన్ లో యాక్టీవ్ మోడ్ లోకి వస్తోంది. ఎన్నికల సమయానికి సత్తా చాటాలనే లక్ష్యంతో అడుగులేస్తోంది. ఏపీలో చిచ్చు రాజేస్తున్న ప్రత్యేక హోదా సబ్జెక్టుతో జనంలోకి వెళ్తోంది కాంగ్రెస్. అప్పట్లో విభజన అంశం పార్టీని దెబ్బకొడితే.. ఇప్పుడు అదే విభజన హామీలతో నెగ్గుకొచ్చే ప్రయత్నాల్లో ఉంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో రాహుల్ పర్యటన కేడర్ లో ఉత్సాహాన్ని నింపుతోంది. తాము కేంద్రంలో అధికారంలోకి వస్తే తమ తొలి ప్రాధాన్యం ప్రత్యేక హోదా అమలు చేయటమేనని అన్నారు రాహుల్ గాంధీ.

కర్నూలు ఎస్టీబీసీ కాలేజ్ గ్రౌండ్ లో జరిగిన బహిరంగ సభ వేదికగా రాహుల్..మోడీ పాలన తీరుపై ఫైర్ అయ్యారు. దొంగ హామీలతో అధికారంలోకి వచ్చిన మోడీ..ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేకపోయారని విమర్శించారు. తనకు అలాంటి తప్పుడు వాగ్థానాలు ఇచ్చే అలవాటు లేదన్నారు రాహుల్.

ప్రస్తుతం ప్రభుత్వాలతో పోల్చితే తమ ప్రభుత్వంలో ప్రజలకు ఎంతమేర మేలు జరిగిందో కూడా సభ వేదికగా వివరించే ప్రయత్నం చేశారు కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఎక్కువ సంక్షేమ పథకాలు అమలయ్యాయని అన్నారు.

విభజన నిందను తమపై రుద్ది టీడీపీ, వైసీపీ పార్టీలు ప్రజలను మోసం చేశాయని ఆరోపించిన కాంగ్రెస్ నేతలు…ఇప్పుడిప్పుడే ప్రజలు వాస్తవాలు తెలుసుకుంటున్నారని అన్నారు.

అంతకుముందు కర్నూలులో దివంగత నేతలు దామోదరం సంజీవయ్య, కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డికి నివాళులు అర్పించారు. ఆయా నేతల కుటుంబాలతో ముచ్చటించారు. ఆ తర్వాత బైరెడ్డి కన్వెన్షన్ హాలులో విద్యార్ధులతో ఇంటరాక్ట్ అయ్యారు రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ పర్యటన..ప్రత్యేక హోదాపై స్పష్టమైన హామీ తర్వాత ఏపీలో కాంగ్రెస్ చరిష్మా పెరుగుతుందని అంచనాల్లో ఉన్నారు ఏపీ కాంగ్రెస్ నేతలు.