విలీన ఎఫెక్ట్‌- బీవోబీకి ఖేదం-దేనాకు మోదం?!

ఆర్థికంగా బలహీనపడుతున్న దేనా బ్యాంక్‌, విజయా బ్యాంకులను మూడో పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా(బీవోబీ)లో విలీనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఇన్వెస్టర్లు బీవోబీ కౌంటర్లో అమ్మకాలకు దిగడంతోపాటు.. దేనా బ్యాంక్‌ కౌంటర్లో కొనుగోళ్లకు క్యూకట్టారు. ఫలితంగా ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో బీవోబీ షేరు దాదాపు 10 శాతం కుప్పకూలింది. రూ. 122 దిగువన ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 116 వరకూ పతనమైంది. అయితే విజయా బ్యాంక్‌ 2.35 శాతం పుంజుకుని రూ. 61.4 వద్ద కదులుతోంది. తొలుత రూ. 66 వరకూ జంప్‌చేసింది. ఇక దేనా బ్యాంక్‌ అయితే అమ్మేవాళ్లు కరవుకావడంతో 20 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 19 వద్ద ఫ్రీజయ్యింది.

ఇవీ ఇతర వివరాలు
పేరుకుపోయిన మొండిబకాయిలు, పెరుగుతున్న నికర నష్టాలతో గత కొంతకాలంగా దేనా బ్యాంక్‌ కార్యకలాపాలు కుదేలయ్యాయి. ప్రభుత్వ వివరాల ప్రకారం దేనా బ్యాంకు మొండి బకాయిల భారం కు 11 శాతంకాగా.. విజయా బ్యాంకు సైతం 4 శాతం ఎన్‌పీఏలతో సతమతమవుతోంది. ఇక వీటిని విలీనం చేసుకోనున్న బ్యాంక్ ఆఫ్ బరోడాకు 5.4 శాతం ఎన్‌పిఏలు ఉన్నాయి. మూడూ విలీనమైతే… ఆవిర్భవించే కొత్త బ్యాంక్ ఎన్‌పిఏల భారం 5.7 శాతానికి చేరనున్నట్లు అంచనా. కాగా.. గత 11 క్వార్టర్లుగా నిరుత్సాహకర ఫలితాలనే ప్రకటిస్తూ వస్తున్న దేనా బ్యాంకు సుమారు రూ.4500 కోట్లమేర నష్టాలను ప్రకటించింది. బ్యాంకింగ్‌ పరిశ్రమలోనే అత్యధిక స్థాయిలో మొండి బకాయిలు పేరుకుపోయాయి కూడా. గత 6 త్రైమాసికాల నుంచీ బ్యాంకు నష్టాలనే నమోదు చేస్తోంది. దీంతో విలీనం ద్వారా దేనా బ్యాంక్‌ లబ్ది పొందనున్నట్లు భావించిన ఇన్వెస్టర్లు ఈ కౌంటర్లో కొనుగోళ్లకు ఎగబడుతుంటే.. అదనపు బకాయిలు, నష్టాల భారాన్ని తలకెత్తుకోనున్నట్లు ఆందోళనకు లోనై బీవోబీ కౌంటర్లో అమ్మకాలు చేపడుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు.