జేసీ దివాకర్ రెడ్డికి చంద్రబాబు వార్నింగ్

అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. తాడిపత్రిలోని ప్రబోధానంద స్వామిజీ ఆశ్రమం ఆందోళనల నేపథ్యంలో ఆయన వైఖరి మరోసారి చర్చనీయాంశమైంది. రెండు రోజుల పాటు హల్‌చల్‌ చేసిన ఈ వివాదంలో.. ఏపీ సిఎం చంద్రబాబు కలగజేసుకుని ఈ వివాదానికి ఫుల్‌స్టాప్‌ పెట్టారు. అంతేకాక జేసీ దివాకర్ రెడ్డి గట్టి వార్నింగ్ ఇచ్చి పంపారు చంద్రబాబు.

అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఏది చేసినా సంచనలమే. ఈ సారి ప్రబోధానంద స్వామిజీపై ఆయన తీవ్రస్థాయిలో ఆందోళనకు దిగారు. తాడిపత్రి సమీపంలోని ఆశ్రమాన్ని అనుకుని ఉన్న గ్రామాల్లో రెండు రోజుల పాటు హల్‌చల్‌ చేశారు జేసి. ఆశ్రమం వద్ద… పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి హడావుడి చేశారు. దాడుల వంటి ఘటనలు కూడా తాడిపత్రి ఏరియాలో చోటు చేసుకున్నాయి. అధికార పార్టీ ఎంపీ అయి ఉండి పోలీసులను సైతం లెక్క చేయకుండా దుర్భాషలాడారు దివాకర్ రెడ్డి. స్వామిజీ ఆశ్రమంపై పోలీసులు అనుసరించిన తీరును తీవ్రస్థాయిలో తూర్పారపట్టారు జేసి దివాకర్ రెడ్డి.

జేసీ వ్యవహారం అధికార టీడీపీకి తలనొప్పిగా మారింది. ఘటన జరిగిన వెంటనే సీఎం చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగి పోలీసు ఉన్నతాధికారులు, జిల్లా ప్రజాప్రతినిధులతో మాట్లాడి పరిస్థితిని కంట్రోల్ లోకి తీసుకొచ్చారు. వెంటనే జేసి దివాకర్ రెడ్డిని అమరావతి రావాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం రాత్రి అమరావతికి వచ్చిన జేసిని ముందుగా కలిసేందుకు కూడా చంద్రబాబు నాయుడు ఇష్టపడలేదు. అయితే బుధవారం ఉదయం మరొకసారి సీఎం నివాసానికి వెళ్ళిన జేసి ….పరిస్థితిని చంద్రబాబు కు వివరించే ప్రయత్నం చేశారు. అయితే చంద్రబాబు మాత్రం జేసికి సీరియస్ గానే వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలిసింది. జిల్లా ప్రజాప్రతినిధులు సైతం ఈసారి జేసీపై తీవ్రస్థాయిలోనే ఫిర్యాదు చేశారు. జేసి వల్ల జిల్లా మొత్తానికే చెడ్డపేరు వస్తోందని సీఎం ముందు ఏకరవుపెట్టారు. ఇవన్ని గమనించిన చంద్రబాబు… ఆయన్ని ఇలానే వదిలేస్తే జిల్లాలో పార్టీకి చెడ్డపేరు వస్తుందని భావించారు. అందుకే జేసీని తీవ్రంగానే మందలించినట్లు తెలుస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో సీనియర్ నాయకుడై ఉండి ఈ విధంగా వ్యవహరించడం ఎంతవరకు కరెక్ట్ అని సీఎం అన్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. సీఎంతో భేటీ అనంతరం అసెంబ్లీకి వచ్చిన జేసీ…. స్వామిజీకి సంబంధించిన కొన్ని వీడియోలను మీడియాకు విడుదల చేశారు…

పనిలోపనిగా స్థానిక పోలీసులపై జేసీ మరోసారి తీవ్రవస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. పరిస్థితి చేయిదాటిపోడానికి పోలీసుల వైఖరే కారణమని ఆరోపించారు. భక్తులు దాడులు చేస్తుంటే.. ముందుగా పోలీసులే పారిపోయారంటూ ఎద్దేవా చేశారు… మొత్తానికి జేసీకి కళ్లెం వేసేందుకు చంద్రబాబు గట్టి ప్రయత్నమే చేశారు. అయితే ఇప్పటికైనా దివాకర్‌ రెడ్డి మారుతారా.. లేక తన వైఖరి తనదే అంటూ సాగిపోతారా వేచిచూడాలి.