ఈ వికృత క్రీడకు అంతం లేదా?

ప్రేమను వ్యతిరేకిస్తున్న పేరెంట్స్.. తమ పిల్లల్నే నిర్దాక్షణ్యంగా నరికి చంపుతున్నారు. కడుపు తీపిని క్షణాల్లో బలి తీసుకుంటున్నారు. పరువు హత్యల కోసం మృగావతారం ఎత్తుతున్నారు. నడిరోడ్లపై మారణహోమం సృష్టిస్తున్నారు. ప్రేమించడం.. నేరమా? శాపమా? పాపమా?. సామాజికవర్గాలు వేరైతే చంపేయాలా? సాటి మనుషులన్న కనికరం కూడా ఉండదా? ఈ పంతాలు, పట్టింపులే మరణశాసనాన్నీ రాస్తున్నాయి. చిన్నప్పుడు ఉగ్గుపాలు పట్టిన కన్నవాళ్లే ఒక్కసారిగా ఉన్మాదుల్లా మారుతున్నారు. ఈ వికృత క్రీడకు అంతం లేదా? సమాజంలో ప్రేమకు స్థానం లేదా? ప్రేమ పెళ్లి చేసుకుంటే కడతేర్చడమేనా? అయినా కులం వేరైతే.. బంధాలు, బంధుత్వాలు మలినమైపోతాయా? జాలి, దయ, కరుణ చూపిన చేతులే ఎందుకు కాఠిన్యాన్ని ప్రదర్శిస్తు్న్నాయి?

ప్రేమించడం నేరమా? లేక ప్రేమించడం శాపమా? ఇది ప్రేమికులు వేసే ప్రశ్న. కాని వారికి దీనికి సమాధానం లభించేలోపే.. ఆ జంటలో ఎవరో ఒకరు.. ప్రాణాలు వదిలేస్తున్నారు. దీనికి కారణం.. నవ జంటలపై పగపడుతున్న తల్లిదండ్రులు. కొంతమంది పరువుకు భయపడి తలదించుకుంటే.. మరికొందరు పరువు సమస్యతో పగ పెంచుకుంటున్నారు. అదే ద్వేషంతో.. అయితే కూతురిని, లేకపోతే అల్లుడిని నరికేస్తున్నారు. ప్రేమిస్తే చంపేస్తారా?

అల్లారుముద్దుగా కనిపెంచిన పిల్లలు. వారికి ఏది కావాలంటే దానిని ఇచ్చేంత గారాబం. కాని పెళ్లి విషయానికి వచ్చేసరికీ మాత్రం వీళ్లకు తమ పిల్లలు చేసే పని నచ్చడం లేదు. ప్రేమ పేరుతో తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకుంటున్నారంటూ కోపం పెంచుకుంటున్నారు. అది కాస్తా పగగా మారుతోంది. హైదరాబాద్ లోని ఎస్ ఆర్ నగర్ లో జరిగిన సందీప్, మాధవి స్టోరీని చూస్తే ఇదే అర్థమవుతుంది. ప్రణయ్-అమృతల ఉదంతం మర్చిపోకముందే.. జరిగిన ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. మిర్యాలగూడ సీన్ మళ్లీ రిపీట్ అయ్యేసరికీ.. ప్రేమికులంతా భయపడుతున్నారు.

హైదరాబాద్‌ ఎర్రగడ్డలోని నడి రోడ్డుపై జరిగిన దాడి సంచలనం సృష్టించిందియ ఎర్రగడ్డ దగ్గర ప్రేమ్‌నగర్‌కు చెందిన సందీప్‌, బోరబండ వినాయక్‌రావు నగర్‌కు చెందిన మాధవి గత ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరి సామాజికవర్గాలు వేరు కావడంతో యువతి తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోలేదు. ఈ క్రమంలో అమ్మాయికి తన మేనబావతో వివాహం చేయాలని నిశ్చయించారు. మాధవి కొన్ని రోజుల క్రితం సందీప్‌ ఇంటికి వచ్చింది. ఈ నెలలోనే అల్వాల్‌లోని ఓ ఆలయంలో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి విషయం తెలిసిన అమ్మాయి తల్లిదండ్రులు తొలుత వ్యతిరేకించినా.. పోలీసులు నచ్చజెప్పడంతో తర్వాత ఒప్పుకున్నారు. ఇరు కుటుంబాల మధ్య సయోధ్య కుదిరింది. అప్పటి నుంచి మాధవి తన భర్తతో అత్తగారింట్లోనే ఉంటోంది.

మాధవి తండ్రి మనోహరాచారి రెండు రోజులుగా ఆమెతో ప్రేమగా ఉన్నట్లు నటించాడు. నిజానికి తన కూతురి ప్రేమ పెళ్లి ఆయనకు ఇష్టం లేదు. అందుకే కుట్ర పన్నాడు. మాట్లాడుకుందాం రమ్మంటూ నవదంపతులను ఎర్రగడ్డగకు పిలిపించాడు. మనోహారాచారి‌ కోసం రోడ్డు పక్కన సందీప్-మాధవి వెయిట్‌ చేశారు. ఐతే.. మరో బైక్‌ వచ్చిన మాధవి తండ్రి బ్యాగ్‌ నుంచి కత్తిని తీసి.. మొదట సందీప్‌పై దాడికి దిగాడు. దీన్ని ఆపబోయిన మాధవిపైనా విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆపేందుకు కొందరు ప్రయత్నించినా.. కత్తితో వారిని బెదిరించాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ దాడిలో మాధవికి మెడ, చేతులపై తీవ్ర గాయాలు కాగా, సందీప్‌కి ముఖం నుంచి దవడ వరకు గాయాలయ్యాయి. వీరిని వెంటనే సమీపంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు.

కడప జిల్లాకు చెందిన దీప్తిరెడ్డి, విజయ్ లు ప్రేమకథ కూడా ఇంతే. కులాంతర వివాహం చేసుకున్న ఈ ప్రేమికులు బంధువుల నుంచి తమకు వస్తున్న బెదిరింపులతో భయపడుతున్నారు. ఈ ఏడాది జులై 26న కడపలో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. అమ్మాయి తరపు బంధువులు పోలీసు శాఖలో ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారని, వారి ద్వారా తమను బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ప్రాణహాని ఉందని..రక్షణ కల్పించాలని కోరుతున్నారు.

మిర్యాలగూడలో ప్రణయ్‌ హత్యోదంతంలో మారుతీరావు కిరాతకంపై జనం విరుచుకుపడ్డారు. ప్రేమికులపై ఇదే చివరి దాడి కావాలని ఆకాంక్షించారు. సమాజంలో మార్పు వస్తున్నా.. ప్రేమికులపై మాత్రం దాడులు ఆగడం లేదు. ఇప్పుడు ఎర్రగడ్డలో జరిగిన దాడి, కడప జిల్లాలో ప్రేమజంటకు ఎదురైన బెదిరింపులతో.. లవర్స్ లో భయాందోళనలు మరింతగా పెరిగాయి.