టిడిపిలో గ్రూపు రాజకీయాలు..సొంత పార్టీ పైనే తిరుగుబాట్లు

మాచర్ల పురపాలక సంఘం పై టిడిపి జెండా ఎగిరింది మొదలు నాలుగేళ్ళు దాటినా యింకా వివాదాలు సమసి పోలేదు. గ్రూపు రాజకీయాలు, సొంత పార్టీ పైనే తిరుగుబాట్లు వంటి పరిణామాల నేపధ్యంలో అధికార పార్టీ ప్రాభవం మసకబారింది. ఐదేళ్ల పదవి కాలాన్ని ముగ్గురు నేతలు పంచుకోవడానికి చేసుకున్న తొలి ఒప్పందాలు వివాదాలకు కారణం అయ్యాయి. తొలి మహిళా చైర్ పర్సన్ గా ఎన్నికైన గోపవరపు శ్రీదేవి ఆమె భర్త మల్లికార్జునరావు ఈ వ్యవహారాల్లోనే ప్రాణాలు కోల్పోయారు. ఆ సంఘటన తర్వాత రెండో చైర్మన్ గా ఎన్నికైన మంగమ్మ తన రెండేళ్ల పదవి కాలం పూర్తయ్యాక కూడా పదవిని వదులుకునేందుకు ససేమిరా అన్నారు.పార్టీ కట్టుబాట్లు పాటించాల్సిందే అన్న అధిష్టానం మందలింపుతో రెండు నెలల క్రితం పదవి నుండి తప్పుకున్న మంగమ్మ వేరు కుంపటి రాజేశారు.

ఈ నేపధ్యంలో ఇంచార్జి చైర్మన్ గా షాకిరూన్ ను కౌన్సిల్ ఎన్నుకుంది.కానీ తనను బలవంతంగా ఒత్తిడి చేసి రాజీనామా చేయించారని, తన పదవిని పునరుద్ధరించాలని మంగమ్మ హైకోర్టు ని ఆశ్రయించినట్టు సమాచారం. మంత్రి ప్రత్తిపాటి, జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు సమక్షంలో రెండు, మూడు దఫాలు పంచాయతీ లు జరిగినా ఓ పట్టాన మంగమ్మ ఒప్పుకోలేదు. దీంతో స్థానిక పార్టీ ఇంచార్జి కొమ్మారెడ్డి చలమా రెడ్డి పెద్దన్న పాత్ర పోషించి సమస్యని ఓ కొలిక్కి తెచ్చారు. మంగమ్మ వర్గానికి ఉన్న సందేహాలను చలమా రెడ్డి సొంత పూచీకత్తు వహించి ఒప్పించగలిగారు. తీరా ఎన్నిక జరిగేనాటికి విషయం మళ్ళీ మొదటికి వచ్చింది.

బుధవరాం మూడో చైర్మన్ ఎన్నుకునేందుకు ఎన్నికల సంఘం ముహూర్తం ఖరారు చేసింది.మంగమ్మ తన వర్గానికి చెందిన ఎనిమిది మంది కౌన్సిలర్లతోపట్టణాన్ని వదిలి క్యాంపు పెట్టినట్టు తెలిసింది. ఎన్నికకు కోరం కావాలంటే 15 మంది సభ్యులు అవసరం. అధికార పార్టీలో ని 21 మంది లో ఎనిమిది మందిని మినహాయిస్తే చాలినంత బలం లేనందున ఎన్నిక వాయిదా పడే అవకాశం ఏర్పడింది.టీడీపీ అధిష్టానం ఇన్చార్జి ఛైర్మన్ షాకిరూన్ ను చైర్మన్ గా ఎన్నిక చేయాలన్న సంకల్పం తో ఉంటే మాజీ చైర్మన్ మంగమ్మ మాత్రం పదవిలో కొనసాగేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తూనే వచ్చింది. తన పదవీ కాలంలో సమీప బంధువుతో కాంట్రాక్టు పనులు చేపట్టిన మంగమ్మ తమ బిల్లులు అన్నీ వచ్చాకే పదవి నుంచి తప్పుకోవాలని ఆలోచన చేసినట్టు తెలిసింది.ఈ నేపధ్యంలో జరగనున్న ఎన్నిక దృష్ట్యా పట్టణం లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ లు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. మున్సిపల్ కార్యాలయం ఆవరణలో 144 సెక్సన్ పెట్టారు.ఎట్టకేలకు మెజారిటీ కి కావాల్సిన 15 మంది కౌన్సిలర్ లు హాజరు కావడంతో మాచర్ల మున్సిపల్ చైర్మన్ గా షాకీరూన్ ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు.