టీఆర్ఎస్ నేతకు తెలంగాణ కాంగ్రెస్ కమిటీలో కీలక పదవి

ముందస్తు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ దూకుడు పెంచింది. పార్టీ వర్గాలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎన్నికల కమిటీలను ఏఐసీసీ ప్రకటించింది. పలువురు కీలక నేతలకు కమిటీల్లో స్థానం కల్పించింది అధిష్టానం.

తెలంగాణ ఇచ్చింది…. తెచ్చింది కాంగ్రెస్సే అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి అధికారం దక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఉవ్విళ్లూరుతోంది. ఇందులో భాగంగానే ఎన్నికల కమిటీలను ప్రకటించింది అధిష్టానం. తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌లను నియమిస్తూ ప్రకటన విడుదల చేసింది. 9 అనుబంధ కమిటీలతో పాటు.. 53 మందితో కో-ఆర్డినేషన్ కమిటీని ప్రకటించింది ఏఐసీసీ.

కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్‌గా కుంతియా, కన్వీనర్‌గా ఉత్తమ్ కుమార్ రెడ్డిని నియమించింది. ప్రచార కమిటీ చైర్మన్‌గా మల్లు భట్టివిక్రమార్క, కో చైర్‌పర్సన్‌గా డీకే అరుణ, కన్వీనర్‌గా దాసోజ్‌ శ్రవణ్‌, మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా దామోదర రాజనర్సింహ, కో చైర్‌పర్సన్‌గా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, స్ట్రాటజీ అండ్ ప్లానింగ్‌ కమిటీ చైర్మన్‌గా వీహెచ్‌, కో చైర్‌పర్సన్‌లుగా సర్వే సత్యనారాయణ, మధుయాష్కి, శ్రీధర్‌బాబు, కన్వీనర్‌గా పొంగులేటి సుధాకర్‌రెడ్డిని నియమించారు. ఎలక్షన్‌ కమిషన్‌ కోఆర్డినేషన్‌ కమిటీ చైర్మన్‌గా మర్రి శశిధర్‌రెడ్డి, కో చైర్‌పర్సన్‌గా కమలాకర్‌, కన్వీనర్‌గా జి. నిరంజన్‌, డిసిప్లినరీ యాక్షన్‌ కమిటీ చైర్మన్‌గా కోదండరెడ్డిని, కో చైర్‌పర్సన్‌గా ఏ శ్యాంమోహన్‌, కన్వీనర్‌గా నందిఎల్లయ్య, పి. బలరాం నాయక్‌లని నియమిస్తూ ప్రకటన విడుదల చేసింది.

అయితే మరోపక్క తెలంగాణ కాంగ్రెస్ కమిటీలో టీఆర్ఎస్ నేత సురేష్ రెడ్డికి కీలక పదవి దక్కింది. కో ఆర్టినేషన్ కమిటీలో ఆయనకు స్థానం కల్పించారు. పార్టీ మారిన సురేష్ రెడ్డికి కో ఆర్టినేషన్ కమిటీలో చోటు దక్కడంపై సర్వత్రా చర్చనీయాంశమైంది. మొత్తం మూడు కమిటీల్లో సురేష్ రెడ్డికి చోటు కల్పించినట్లు తెలుస్తోంది.