ప్రేమ-పరువు ఈ రెండింటిలో ఏది ముఖ్యం?

ఒక వ్యక్తిపై ప్రేమ ఉందీ అంటే వారు మనసుకు నచ్చారని అర్థం. యుక్తవయసు వచ్చిన తరువాత అలా నచ్చిన వ్యక్తిని మనవాడాలని ఎవరైనా కోరుకుంటారు. అందుకే వారితో జీవితాన్ని పంచుకోవడానికి వారిపై ప్రేమను పెంచుకుంటారు. కానీ అదే వారికి శాపమవుతోంది. పెద్దలను ఒప్పించడంలో విఫలం కావడంతో.. ఆ జంటలో ఒకరు ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రణయ్-అమృత, సందీప్-మాధవి.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో జంటల ప్రేమకథలు కనిపిస్తాయి. ప్రేమించడం తప్పు కాదు. కాని దానికి పెద్దల ఆమోదం లభించకపోవడంతోనే సమస్యలన్నీ. సో.. కన్నవాళ్లను ఒప్పించగలిగితే.. వారికి పరువు సమస్య ఉండదు. అప్పుడు వాళ్లు ప్రాణాలు తీసేంత కిరాతకానికి పాల్పడరు. సమస్యకు రెండువైపుల నుంచీ పరిష్కారాన్ని ఆలోచిస్తేనే.. సామరస్య వాతావరణం ఉంటుంది. లేదంటే విషాదమే మిగిలే ప్రమాదముంది.

అమ్మాయిల తల్లిదండ్రులు ఎందుకు హంతకులుగా మారుతున్నారు? దీనికి సమాధానం చెప్పాలంటే.. ఆ అమ్మాయి చిన్నప్పటి రోజులకు వెళ్లాలి. అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డ.. యుక్తవయసు వచ్చాక తనకు నచ్చినట్టు తాను ఉంటానంటే.. ఆ తండ్రి మనసు తట్టుకోలేదు. మిగిలిన విషయాల మాట ఎలా ఉన్నా.. పెళ్లి విషయంలో మాత్రం తన మాటే నెగ్గాలనుకుంటాడు. తండ్రీ-బిడ్డల మధ్య జరిగే ఈ సంఘర్షణ ఆగేదెలా?

ప్రేమ-పరువు. ఈ రెండింటిలో ఏది ముఖ్యం అనే ప్రశ్నకు ఎక్కువమంది సమాధానం చెప్పలేమంటారు. ఎందుకంటే.. యుక్తవయసులో ఉన్నవారికి ప్రేమ ముఖ్యం. పెద్దవాళ్లకు పరువు ముఖ్యం. చాలామంది ప్రేమకథల్లో రెండింటి మధ్యా సఖ్యత ఉండదు. అందుకే చాలా ప్రేమలు పెళ్లి వరకు వెళ్లవు. పరువు తీసే ప్రేమ అవసరం ఎంత అని పెద్దవాళ్లు ప్రశ్నిస్తారు. అయినా ప్రేమంటే.. పరువుని చూసుకుని పుట్టేదా అని ప్రేమికులు అడుగుతారు. ఇది ఇప్పటి వ్యవహారం కాదు. కొన్ని తరాలుగా సమాజంలో జరుగుతున్న సంఘర్షణ. అందుకే వేరు వేరు సామాజికవర్గాల ప్రేమకథలు విషాదంగానే ముగుస్తుంటాయి. తల్లిదండ్రులకు మానసిక బాధను మిగులుస్తాయి.

ప్రేమకు కావల్సింది.. మనసులు కలవడం. కులమతాలు, ఆస్తి అంతస్తులు చూసుకుని పుట్టేది ప్రేమ కాదు అని చాలామంది చెప్పచ్చు. కాని ప్రేమికుల మధ్య ప్రేమ మాత్రమే ఉంటే సరిపోదు. వాళ్లు జీవించడానికి ఆర్థిక స్థితి బాగుండాలి. సమాజం నుంచి ఎదురయ్యే ఆటుపోట్లను తట్టుకుని బతికేంత ధైర్యం కావాలి. ఈ లక్షణాలకు కులం, మతం అవసరం లేకపోవచ్చు. పరువు గురించి పాకులాట అక్కర్లేదు అనుకోవచ్చు. కాకపోతే.. ప్రేమ.. పెళ్లిగా మారడానికి ఇరు కుటుంబాలను ఒప్పించడం వేరు. పదిమందినీ ఎదిరించడం వేరు అని మర్చిపోకూడదు. ఈ రెండింటిలో వాళ్లు ఏం చేస్తారు అన్నదానిపైనే వాళ్ల లవ్లీ లైఫ్ ఆధారపడి ఉంటుంది.

గతంలో ఉత్తరభారతంలో మాత్రమే ఇలాంటి పరువు హత్యలు కనిపించేవి. కానీ ఇప్పుడు దక్షిణ భారతంలో కూడా పెరిగాయి. 2014 నుంచి 2017 వరకు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 17 పరువు హత్యలు వెలుగుచూశాయి. ఈ దారుణాలన్నీ కులాంతర వివాహానికి సంబంధించినవే. 2014-15 లో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కల ప్రకారం.. పరువు హత్యల్లో గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఆ తరువాతి స్థానాలు మన తెలుగు రాష్ట్రాలవే. ఇలాంటి ఉదంతాలను చూసిన సుప్రీంకోర్టు.. హత్య చేయడంలో పరువు ఎక్కడుంది.. ఇలాంటి దారుణ చర్యలకు పాల్పడేవాళ్లు కఠిన శిక్షకు అర్హులు అని తీర్పునిచ్చింది.

సామాజికవర్గం అనే భూతాన్ని భూతద్దంలో చూస్తున్నారని. పరువు-ప్రతిష్ట అనే చట్రంలో ఇరుక్కుపోతే.. పేగుబంధాన్ని తెంచుకోవడానికి, ప్రేమను అంతం చేయడానికి కూడా వెనుకాడరని తెలుస్తోంది. వాళ్ల భావోద్వేగాలు ఆ స్థాయిలో ఉంటున్నాయి. ఓరకంగా ఈ సొసైటీకి భయపడే వాళ్లు ఇలాంటి భయంకరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని అంటున్నారు మానసిక శాస్త్రవేత్తలు.

సామాజికవర్గం ఎక్కువా? మానవత్వం ఎక్కువా అంటే.. కొందరు పెద్దల ఓటు సామాజికవర్గానికే. ప్రేమికుల బాట మానవత్వం వైపే. సెలబ్రెటీలకే లేని కులమతాలు.. సామాన్యులకు ఎందుకు? పిల్లల ఉసురు తీసేంతగా వాళ్లపై పగను పెంచుకోవడమెందుకు? అయినా ప్రేమికులు కూడా తల్లిదండ్రులను ఒప్పించి వాళ్ల అంగీకారంతో పెళ్లి చేసుకుంటే చాలావరకు సమస్యలు తగ్గుతాయి. కానీ ఈ ప్రయత్నంలో విపరీతమైన నిర్ణయాలు తీసుకోకూడదు. చర్చలతోనే చాలా సమస్యలు పరిష్కారమవుతాయని మర్చిపోకూడదు. అలా కాదని నెగటివ్ గా ఆలోచిస్తే.. మనసుకు, మనిషికి శిక్ష తప్పదు.