సీఎం ఆగ్రహంతో అసెంబ్లీకి క్యూ కట్టిన ఎమ్మెల్యేలు!

cm

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రశాంతంగా ముగిశాయి.. ప్రధాన ప్రతిపక్షం వైసీపీ రాకపోయినా, ఆ పాత్రను అధికార పార్టీ ఎమ్మెల్యేలే పోషించారు. ఇక ఏడు రోజులపాటు సాగిన సమావేశాల్లో 16 బిల్లులకు సభ ఆమోదం తెలిపింది.

ఏడు రోజులు.. 51 గంటల 7 నిమిషాలు.. ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రశాంతంగా సాగాయి. ఈ సమావేశాల్లోనూ అధికార పార్టీ ఎమ్మెల్యేలే ప్రతిపక్ష పార్టీ పాత్రను పోషించారు. ప్రతిపక్షం అడగాల్సిన ప్రశ్నలను అధికార పార్టీ ఎమ్మెల్యేలే మంత్రులకు సంధిస్తూ సమాధానాలు రాబట్టగలిగారు. మొదట ఒకట్రెండు రోజులు అధికార పార్టీ ఎమ్మెల్యేలు సమావేశాలను లైట్‌ తీసుకున్నారు. అసెంబ్లీకి డుమ్మా కొట్టారు. ఆ తర్వాత చంద్రబాబు సీరియస్‌ వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యమంత్రే నేరుగా ఎమ్మెల్యేల అటెండెన్స్‌ను చెక్‌ చేస్తుండటంతో వారంతా సభకు క్యూ కట్టారు. సమయం దొరికినప్పుడల్లా ప్రజా సమస్యలపై మంత్రులకు ప్రశ్నలు సంధించి ప్రతిపక్షం లేని లోటును కూడా అధికారపార్టీ ఎమ్మెల్యేలే పూడ్చారు.

ఇక ప్రధాన ప్రతిపక్షం వైసీపీ పాత్రను తామే పోషిస్తామన్న బీజేపీ.. ప్రభుత్వాన్ని నిలదీయడంలో ఫెయిల్ అయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. బీజేపీ తరపున ఉన్న నలుగురు ఎమ్మెల్యేల్లో విష్ణుకుమార్ రాజు మినహా మిగతా ముగ్గురు సభ్యలు సభకు సరిగా హాజరు కాలేదు. మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ ఒక్క రోజుకూడా అసెంబ్లీకి రాలేదు. మాణిక్యాలరావు, ఆకుల సత్యనారాయణ సమావేశాలకు హాజరైనా అంటీముట్టనట్టుగా వ్యవహరించారు. ఇక ఆ పార్టీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు మాత్రమే అన్ని రోజులు హాజరై అడపా దడపా కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రిని పొగుడుతూ, మరికొన్ని సందర్భాల్లో విమర్శిస్తూ సమ న్యాయం పాటించినట్టుగా కనిపించారు. బీజేపీ తరపున శాసనమండలిలో ఉన్న సోము వీర్రాజు, మాధవ్ మాత్రమే అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలకంటే కాస్త పర్వాలేదనిపించారు.

మొత్తం 51 గంటల 7 నిమిషాల పాటు సభ జరిగింది. 16 బిల్లులను ఆమోదించగా.. ఒక బిల్లు ఉపసంహరించారు. 108 మంది సభ్యులు ప్రసంగించారు. అధికార పక్షం 86 ప్రశ్నలకు సమాధానాలిచ్చింది. ప్రభుత్వం రెండు తీర్మానాలు ప్రవేశపెట్టింది. 344 నిబంధన కింద ఏడు అంశాలపై సభలో చర్చ జరిగింది. 74 నిబంధన కింద మరో ఏడు అంశాలపై చర్చించారు. చివరి రోజు గోదావరి పుష్కర తొక్కిసలాట నివేదిక అసెంబ్లీ ముందుకు వచ్చింది. ఆ ఘటనపై జస్టిస్ సోమయాజులు పలుమార్లు బహిరంగ విచారణ జరిపారు. సుదీర్ఘ విచారణ తర్వాత తన నివేదికను చంద్రబాబు ప్రభుత్వానికి అందించారు. ఆ దుర్ఘటనకు చంద్రబాబు కారణం కాదని తేల్చారు. ఒకే ముహూర్తానికి అందరూ స్నానం చేయాలని ఆరాటపడడంతోనే ప్రమాదం జరిగినట్టు నివేదికలో పేర్కొన్నారు.

అటు శాసనమండలిలో చివరి రోజు 14 బిల్లులు ఆమోదం పొందాయి. పలు సవరణ బిల్లులు మండలి ముందుకు రాగా విపక్షాల నిరసనల మధ్యే చైర్మన్‌ వాటిని ఆమోదించారు. సీపీఎస్‌పై ఆర్థిక మంత్రి ప్రకటన తర్వాత మండలిని నివరధికంగా వాయిదా వేశారు.