పాక్‌ను చిత్తు చేసిన భారత్‌..

ఎన్నో అంచనాలు… మరెన్నో విశ్లేషణల మధ్య జరిగిన భారత్‌,పాకిస్థాన్ ఆసియాకప్‌ పోరు వన్‌సైడ్‌గా ముగిసింది. అనిశ్చితికి మారుపేరైన పాక్ ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోవడంతో టీమిండియా 8 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. బౌలింగ్‌లో భువనేశ్వర్, కేదార్ జాదవ్‌… బ్యాటింగ్‌లో ఓపెనర్లు రాణించారు.

ఆసియాకప్‌లో టీమిండియా ఫుల్‌ ఫామ్‌లోకి వచ్చింది. హాంకాంగ్‌పై చెమటోడ్చి గెలిచిన భారత్ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై మాత్రం అదరగొట్టింది. తిరుగులేని ఆధిపత్యం కనబరుస్తూ మ్యాచ్‌ను వన్‌సైడ్‌గా ముగించేసింది. దీంతో మ్యాచ్ గెలవడం అభిమానులకు సంతోషాన్నిచ్చినా… ఉత్కంఠపోరు జరగలేదన్న నిరాశ కూడా కనిపించింది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ వ్యూహం పూర్తిగా తలకిందులైంది. భారీస్కోర్ చేసి భారత్‌పై ఒత్తిడి పెంచుదామనుకున్న పాక్‌కు భువనేశ్వర్‌, కేదార్ జాదవ్ షాకిచ్చారు. ప్రధాన బ్యాట్స్‌మెన్లలో షోయబ్ మాలిక్‌ తప్పిస్తే… మిగిలిన వారంతా పెవిలియన్‌కు క్యూ కట్టారు. పిచ్‌ బౌలింగ్‌కు పూర్తిగా అనుకూలం కాకున్నా… పాక్‌ చేతులెత్తేయడం అందరినీ నిరాశపరిచింది. అయితే మాలిక్ కాసేపు పోరాడడంతో పాక్ 162 పరుగులైనా చేయగలిగింది.

బౌలర్లు ఇచ్చిన ఉత్సాహంతో బ్యాటింగ్‌లో ఓపెనర్లు కూడా సత్తా చాటారు. ఫామ్‌లో ఉన్న ధావన్ మరోసారి రోహిత్‌తో కలిసి మంచి పార్టనర్‌షిప్‌నే అందించాడు. వీరిద్దరూ ఔటయ్యాక దినేశ్ కార్తీక్, అంబటి రాయుడు జట్టు విజయాన్ని పూర్తి చేశారు. పాక్ బౌలర్లు కూడా విఫలమవడంతో టీమిండియా 29 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించింది.

హాంకాంగ్‌ను కట్టడి చేయడంలో విఫలమైన భారత బౌలర్లు పాకిస్థాన్‌పై తిరుగులేని ఆధిపత్యం కనబరిచి విజయంలో కీలకపాత్ర పోషించారు. పసికూనపై ప్రభావం చూపలేకపోయారంటూ వచ్చిన విమర్శలకు చిరకాల ప్రత్యర్థిపై తమదైన ఆటతీరుతో సమాధానమిచ్చారు. ఈ టోర్నీ సూపర్‌ ఫోర్ స్టేజ్‌లోనూ భారత్‌-పాక్ మరోసారి తలపడనున్నాయి.