అసంతృప్తుల్ని దారికి తెచ్చుకునేందుకు కేసీఆర్ వ్యూహం

ముందస్తు వ్యూహంతో గులాబీదళం మరింత దూకుడుగా వెళ్తోంది. జనాల్లో పార్టీకున్న మైలేజీని మరింత పటిష్టం చేసుకునేందుకు వ్యూహ రచన చేస్తోంది. ప్రచార సభలకు టీఆర్‌ఎస్ రంగం సిద్ధం చేసుకుంటోంది. వంద నియోజకవర్గాలలో బహిరంగ సభలకు హాజరయ్యే విధంగా గులాబీ దళపతి రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నారు.

అసెంబ్లీ రద్దు చేసి ఒకే సారి 105 మంది అభ్యర్థులను ప్రకటించి సంచలనానికి తెరలేపిన కేసీఆర్ నియోజక వర్గాల వారీగా ప్రచార సభలకు సిద్ధమవుతున్నారు. గత ఎన్నికల ముందు సుడిగాలి పర్యటన తో 100 బహిరంగ సభలను నిర్వహించి సక్సెస్ అయిన గులాబీ బాస్ ఈ సారి అదే సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నారు. హుస్నాబాద్ సభతో ఎన్నికల శంఖారావానికి శ్రీకారం చుట్టిన కేసీఆర్ అదే ఊపుతో అన్ని నియోజకవర్గాల్లో ఎన్నికల సభలకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించడంతో వాళ్లంతా తమ నియోజకవర్గాలల్లో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు

హుస్నాబాద్ లో సభ నిర్వహించి ఇప్పటికే పది రోజులు కావస్తోంది. వరుసగా సమావేశాలు నిర్వహిస్తారని అభ్యర్థులు భావించినా అనుకోని విధంగా కేసీఆర్ తన టూర్ కు బ్రేక్ ఇచ్చారు. ఈ నెల 23న వినాయక నిమజ్జనం తర్వాత ఎన్నికల ప్రచార సభలకు తిరిగి శ్రీకారం చుట్టబోతున్నారు. ఇక తమ నియోజకవర్గంలో కేసీఆర్ సభ నిర్వహిస్తే కేడర్‌లో మరింత జోష్ వస్తుందని టీఆర్‌ఎస్ అభ్యర్ధులు భావిస్తున్నారు. సభ నిర్వహించేందుకు అధిష్టానం అనుమతి కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అసంతృప్తుల్ని దారికి తెచ్చుకునేందుకు దళపతి సభ అత్యవసరమని భావిస్తున్నారు.

సభల ఏర్పాట్లపై అభ్యర్థుల విన్నపాలు ఎలా ఉన్నా ప్రచార సభల విషయంలో అధ్యక్షుడు కేసీఆర్ నిర్ణయమే ఫైనల్ కానుంది. ఈసారి దక్షిణ తెలంగాణపై కూడా ప్రత్యేక దృష్టి సారించిన కేసీఆర్.. ఇక్కడి నుంచే ఎన్నికల సభ ప్రారంభిస్తారని కొందరు నేతలు చెబుతున్నారు. అయితే కంటిన్యూ సభలు నిర్వహించకుండా దక్షిణ ఉత్తర తెలంగాణ సమన్వయం చేసుకుంటూ ప్రచార సభ సభలు నిర్వహించే అవకాశం ఉంది. అన్ని కార్యక్రమాల్ని ముహూర్త బలంతో ప్రారంభించే కెసిఆర్ ఈ నెల 23 తర్వాత ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. మిగిలిన 14 మంది అభ్యర్థుల ప్రకటన, ప్రచార సభలు, మేనిఫెస్టో విడుదల లాంటి కీలక నిర్ణయాలు వినాయక నిమజ్జనం తర్వాత ఉండే అవకాశం ఉంది.