వంగవీటి రాధాకు సీటు నిరాకరించడానికి కారణం ఇదేనా?

vangaveeti radha may quit ycp

బ్రాహ్మణ సామాజిక వర్గం ఓట్ల గురించి మాత్రమే ఆలోచించిన వైసీపీ.. మరో మెజారిటీ వర్గమైన కాపుల నుంచి ఎదురయ్యే వ్యతిరేకతను ఎలా ఎదుర్కొంటుంది..? వంగవీటి రాధాకు సీటు నిరాకరించడం వెనుక అసలు కారణం ఇది కాదా..? కాపులను దగ్గరకు తీసుకునేందుకు ఎలాంటి వ్యూహాలను సిద్ధం చేస్తోంది..? వైసీపీ అడుగులు ఎటువైపోనన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

విజయవాడ సెంట్రల్‌లో వంగవీటి రాధా సీటుకు వైసీపీ ఎసరు పెట్టింది.. రాధాకు సీటు నిరాకరించడానికి ప్రధాన కారణం ఓట్లు పడవేమోనన్న భయం కాదనే తెలుస్తోంది. రాధా ఆర్థికంగా బలవంతుడు కాకపోవడం కూడా కారణంగా కనిపిస్తోంది. కోస్తాంధ్రలోని కాపు సామాజికవర్గంలో వంగవీటి కుటుంబానికి మంచి పట్టు ఉన్నప్పటికీ.. దానిని అనుకూలంగా మలుచుకునే శక్తి రాధాకు లేదని వైసీపీ అధిష్టానం అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది.

వంగవీటి రాధాకు మొండిచేయి చూపితే కాపుల నుంచి వ్యతిరేకత ఎదురయ్యే ప్రమాదం లేకపోలేదు.. అయితే, దీని నుంచి బయటపడేందుకు మరో ప్లాన్‌ ఆలోచించింది. కాపు ఓటు బ్యాంకు గణనీయంగా ఉన్న విజయవాడ తూర్పు నుంచి గానీ, మచిలీపట్నం పార్లమెంటు నుంచి గానీ పోటీచేసేందుకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఇక గుంటూరు ఎంపీగా టీడీపీ నుంచి కమ్మ సామాజికవర్గానికి చెందిన గల్లా జయదేవ్‌ బరిలో నిలవడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. అయితే, ఇక్కడ కాపు సామాజికవర్గం అభ్యర్థిని బరిలో దింపితే ఆ ఓట్లన్నీ తమకు పడతాయని వైసీపీ అంచనా వేస్తోంది. కేంద్ర మాజీ మంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడు కిలారు రోశయ్యను గుంటూరు ఎంపీ అభ్యర్ధిగా ప్రకటించి ఆ వర్గాల ఆగ్రహానికి అడ్డుకట్టవేసే ప్రయత్నం ప్రారంభించినట్లు సమాచారం. గుంటూరు ప్రభావం కృష్ణా జిల్లాలోనూ ఉండే అవకాశం ఉండటంతో రాధాకు టికెట్‌ నిరాకరించడం ద్వారా జరిగిన డ్యామేజీని ఇలా పూడ్చుకోవచ్చని ప్లాన్‌ చేస్తోంది.

ఇప్పటికే నర్సరావుపేట పార్లమెంటు అభ్యర్థిగా లావు కృష్ణదేవరాయను వైసీపీ ఖరారు చేసింది. గత ఎన్నికల్లో రెడ్డి సామాజికవర్గానికి చెందిన అభ్యర్థిని బరిలో నిలిపి పరాభవం ఎదుర్కొంది. ఈసారి కమ్మ సామాజికవర్గానికి చెందిన కృష్ణదేవరాయను బరిలో నిలిపి ఆ వర్గాన్ని ఆకర్షించాలని భావిస్తోంది.. నరసరావుపేట పార్లమెంటు పరిధిలో లావు కుటుంబానికి విస్తృత పరిచయాలతోపాటు కమ్మ సామాజికవర్గంలో మంచి పట్టుంది. కృష్ణదేవరాయను అభ్యర్ధిగా ప్రకటించడం ద్వారా బలమైన సామాజికవర్గం ఓట్లను ఆకర్షించవచ్చనేది వైసిపి వ్యూహాంగా కనిపిస్తోంది.

ఇక చిలకలూరిపేట అసెంబ్లీ స్థానానికి కమ్మసామాజిక వర్గానికి చెందిన మర్రి రాజశేఖర్‌ను కాదని, బీసీ నేత రజనీని అభ్యర్థిగా ప్రకటించింది వైసీపీ. ఎంపీగా కమ్మ సామాజికవర్గం అభ్యర్థి ఉన్న నేపథ్యంలో ఇక్కడ అభ్యర్థిని మార్చడం ద్వారా ఎలాంటి నష్టం ఉండదని, పైగా బీసీల ఓట్లన్నీ తమ ఖాతాలో పడతాయని అంచనా వేస్తోంది. ఆర్థికంగా కూడా రజనీకి బలం ఉంది. ఈ పార్లమెంటు పరిధిలోని ఇతర అసెంబ్లీ అభ్యర్థులకు ఆర్థిక సాయం తాను చూసుకుంటానని రజనీ హామీ ఇచ్చినట్లు సమాచారం. మొత్తంగా అంగ, అర్థ బలం ఉన్న నేతలను ఎంపిక చేయడం ద్వారా ప్రత్యర్థులను గట్టిగా ఎదుర్కొనే ప్రయత్నాలు చేస్తోంది వైసీపీ. టీడీపీకి కమ్మ సామాజిక వర్గం అండగా నిలిస్తే, జనసేనకు కాపు వర్గం సపోర్ట్‌ ఇస్తోంది. ఈ రెండు వర్గాల ఓట్లను చీల్చడం ద్వారా ఎన్నికల్లో పైచేయి సాధించాలని వైసీపీ అనుకుంటోంది. మరి, వైసీపీ వ్యూహాన్ని మిగిలిన పార్టీలు ఎలా ఎదుర్కొంటాయో చూడాలి.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.