ఈనెల 25 వరకు ఇక్కడే ఉంటా.. నాలుక కోయడానికి సిద్ధంగా ఉండు..

mp jc diwakarreddy counter atack on ci madhav

పోలీసులపై పరుష పదజాలంతో విరుచుకుపడి వార్తల్లో నిలిచిన ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఐ గోరంట్ల మాధవ్‌కు కౌంటర్‌ వార్నింగ్‌ ఇచ్చారు. నాలుకలు కోయించుకునేందుకు ఎక్కడికి రావడానికైనా రెఢీ అంటూనే… దమ్ముంటే ఖాకీ బట్టలు విప్పిరావాలంటూ సవాల్‌ విసిరారు.తాడిపత్రిలో ప్రబోధానంద స్వామి ఆశ్రమ వివాదం కొత్త మలుపు తిరిగింది. ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వర్సెస్ పోలీసులుగా మారిపోయింది. ఆశ్రమ ఘటనపై పోలీసుల తీరును ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తప్పుబట్టడంతో ఆయనపై సీఐ మాధవ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసులను కించపరిస్తే నాలుక కోస్తామంటూ సీఐ మాధవ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెను దుమారమే రేపాయి.

సీఐ మాధవ్‌ వ్యాఖ్యలకు అదే స్థాయిలో కౌంటర్‌ ఇచ్చారు జేసీ దివాకర్‌రెడ్డి. తాను అభ్యంతరకరమైన పదాలు వాడితే.. క్షమాపణ చెప్పడానికైనా సిద్ధమని వ్యాఖ్యానించారు. తాను ఎవర్నీ టార్గెట్ చేయలేదని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.

సీఐ మాధవ్‌పై.. పై అధికారులకు ఫిర్యాదు చేస్తానని.. అవసరమైతే కేసు పెట్టడానికి కూడా సిద్ధమని ఎంపీ చెప్పారు. నాలుకలు కోయించుకోవడానికి తాను సిద్ధమేనని.. ఎక్కడికి రావాలో చెప్పాలంటూ ప్రతి సవాల్‌ విసిరారు. ఖాకీ బట్టలు విప్పి రా.. తేల్చుకుందాం అంటూ వార్నింగ్‌ ఇచ్చారు జేసీ.

200మంది పోలీసుల కళ్ల ముందే దాడికి పాల్పడుతుంటే రక్షించాల్సిన ఖాకీలు పరిగెత్తడం ఎంత వరకు కరెక్టని జేసీ ప్రశ్నించారు. అటువంటి పోలీసులను ఏమనాలో మీరే చెప్పాలంటూ మీడియాను ప్రశ్నించారు. మొత్తంగా జేసీ, పోలీసుల మధ్య ఈ మాటల యుద్ధం ఇంకెంత దూరం వెళ్తుందోనన్న ఆందోళన రాజకీయ నేతల్లో వ్యక్తమవుతోంది.