రాష్ట్రంలోనే తొలిసారిగా డిజిటల్‌ డోర్‌ నంబర్లు : సీఎం చంద్రబాబు

digital dore numbers in andhrapradesh

ఏపీ సీఎం చంద్రబాబు తిరుపతిలో పర్యటించారు. రాష్ట్రంలోనే తొలిసారిగా ఏర్పాటు చేస్తున్న డిజిటల్‌ డోర్‌ నంబర్ల కేటాయింపునకు ఆయన శ్రీకారం చుట్టారు. నగరవనాన్ని ప్రారంభించారు. పచ్చని తిరుపతి.. అత్యంత ఆవాసయోగ్యమైన తిరుపతి అనే నినాదంతో ఎన్టీఆర్ విగ్రహం నుంచి హరిత ర్యాలీని చంద్రబాబు ప్రారంభించారు. కపిలవనం నుంచి అలిపిరి వరకు ఏర్పాటు చేస్తున్న నగరవనం తిరుపతికి ఒక బహుమానమని ఆయన చెప్పారు.చెట్లలో తిరుపతి ఉండాలని చంద్రబాబు ఆకాక్షించారు. నవ్యాంధ్రను హరితాంధ్రగా మార్చాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. భావితరాల కోసం ప్రతి ఒక్కరూ ఒక చెట్టును నాటాలని చంద్రబాబు పిలుపిచ్చారు.

డిజిటల్ డోర్ నంబర్ల వ్యవస్థతో ఎన్నో ప్రయోజనాలున్నాయని చంద్రబాబు తెలిపారు. దీని ద్వారా ప్రభుత్వ సేవలు ఏ సమయానికి అందుతున్నాయో తెలుసుకోవచ్చన్నారు. ప్రభుత్వ సేవలన్నీ సమయం ప్రకారం అందించేందుకే డిజిటల్ డోర్ నంబర్ల వ్యవస్థ ఏర్పాటు చేశామని వివరించారు. అక్టోబర్ 2 మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా ఆయన స్ఫూర్తితో పరిశుభ్ర వాతావరణానికి ప్రతి ఒక్కరూ శ్రీకారం చుట్టాలని చంద్రబాబు కోరారు. కాలుష్యరహిత వాతావరణం కోసం కృషి చేస్తున్నామన్నారు. తిరుపతిలో త్వరలో ఎలక్ట్రానిక్ వాహనాలు పెట్టి కాలుష్యం నివారిస్తామని తెలిపారు.