ఆటవిక చర్యలకు తెగబడ్డ పాక్‌.. భారత్‌ నిర్ణయంతో పాక్‌ షాక్‌

సరిహద్దులో హింసకు పాల్పడుతున్న పాకిస్తాన్ తో చర్చల ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది భారత్. ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సమావేశాల సమయంలో ఇరు దేశాల మధ్య శాంతి చర్చలకు నిర్ణయించినా..పాక్ ఆటవిక చర్యలతో భారత్ తన నిర్ణయం మార్చకుంది. దీనిపై స్పందించిన పాక్..మోదీ ప్రభుత్వం శాంతి చర్చల కన్నా ఎన్నికలకు ప్రధాన్యం ఇస్తోందంటూ విమర్శించారు. చర్చల రద్దు కారణాలను స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేసింది.

ఉప్పు నిప్పులా ఉండే భారత్- పాక్ మధ్య మూడేళ్ల తర్వాత చిగురించిన శాంతి చర్చల ప్రయత్నాలు అప్పుడే బెడిసి కొట్టాయి. ఓ వైపు శాంతి చర్చల రాగం అందుకుంటూనే మరోవైపు సరిహద్దులో విధ్వంస చర్యలకు పాల్పడే పాకిస్తాన్ ఈ సారి కూడా బుద్ధి పోనిచ్చుకోలేదు. పాకిస్తాన్ లో కొత్తగా కొలువుదీరిన ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం కూడా శాంతి చర్చల విషయంలో పాత ప్రభుత్వాల పంచన చేరిపోయింది. అధికారంలోకి వచ్చి రాగానే భారత్ తో చర్చల ప్రతిపాదనకు తీసుకొచ్చాడాయన. దీంతో వచ్చే వారం అమెరికాలో జరిగే ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ ఉన్నతస్థాయి సమావేశాల సమయంలో రెండు దేశాల విదేశాంగ మంత్రులు భేటీ కావాలని నిర్ణయించారు. పాక్ తో చర్చలకు సుముఖత తెలుపుతు భారత విదేశాంగశాఖ అధికార ప్రతనిధి రవీశ్ కుమార్ గురువారం ప్రకటించారు. అయితే..24 గంటలు కూడా కాకముందే సరిహద్దులో పాక్ ఆటవిక చర్యలకు తెగబడింది. భారత సైనికులను హత్య చేయటంతో పాటు.. ఉగ్రవాది బుర్హాన్ వానీ పేరుతో పోస్టల్ స్టాంప్ ను రిలీజ్ చేసింది.

దాయాది వరుస చర్యపై ఆగ్రహం వ్యక్తం చేసిన భారత్..పాక్ తో చర్చల ప్రసక్తే లేదని తేల్చి చెప్పేసింది. అమెరికాలో పాక్ విదేశాంగ మంత్రి ఖురేషితో సుష్మ స్వరాజ్ షేక్ హ్యాండ్ కూడా ఇవ్వరని ఇండియా విదేశాంగ శాఖ అధికారులు క్లారిటీ ఇచ్చారు. సరిహద్దులో హింసకు తెగబడుతూనే శాంతి చర్చల ప్రతిపాదనతో రావటంలోనే పాక్ కుటిల బుద్ధి బయటపడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

భారత్ అనూహ్య నిర్ణయంతో పాక్ షాకైంది. చర్చలకు ఓకే చెప్పిన 24 గంటల్లోనే పాక్ కుటిల బుద్ధిని బయటపెడుతూ చర్చలు రద్దు ప్రకటన చేయటంతో ఆ దేశ ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతోంది. భారత ప్రభుత్వానికి వేరే అంశాలకు ప్రధాన్యం ఇస్తోందని..వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికల నేపథ్యంలో చర్చలను కోరుకోవటం లేదంటూ తమ వైపు వర్షన్ వినిపిస్తోంది. అలాగే చర్చల రద్దుకు గల కారణాలను స్పష్టంగా చెప్పాలంటూ డిమాండ్ చేస్తోంది.