‘మహానటి’ మిస్సైనా ‘ఎన్టీఆర్’ రూపంలో మరోసారి..

కొన్ని పాత్రలు కొంత మంది కోసమే పుడతాయేమో అన్నంతగా ఆ పాత్రల్లో నటించి మెప్పిస్తారు నటీనటులు. అలాంటి అరుదైన సావిత్రి పాత్ర మహానటిలో కీర్తిసురేష్ నటించి ప్రాణం పోసింది. అభిమానులను ఆకట్టుకుంది. ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. నిజానికి ఆ పాత్ర కోసం చిత్ర యూనిట్ నిత్యామీనన్‌ని సంప్రదించారు. కానీ కొన్ని కారణాలవల్ల ఆ పాత్ర చేయలేకపోయానని చెప్పింది. అయితే తాజాగా మరోసారి ఎన్టీఆర్ బయోపిక్ రూపంలో సావిత్రి పాత్ర నిత్యను వరించింది.

క్రిష్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలోని సావిత్రి పాత్ర కోసం నిత్యను సంప్రదించింది చిత్ర యూనిట్. ఒకసారి మిస్సైనా మరోసారి వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదనుకున్నట్లుంది. అందుకే అడగ్గానే ముందు ఆలోచించినా తరువాత ఒప్పేసుకుందట. త్వరలోనే ఆమె షూటింగ్‌లో పాల్గొననుందని చెబుతున్నారు చిత్ర యూనిట్. ఇక శ్రీదేవి పాత్ర కోసం రకుల్ ప్రీత్ బాలయ్యతో జోడీ కట్టనుంది. సంక్రాంతి కానుకగా సందడి చేయబోతోంది ఈ చిత్రం. జనవరి 9న ఎన్టీఆర్ ప్రేక్షకుల ముందుకు వచ్చి అభిమానులకు ముందే పండగను తీసుకువస్తుంది.