తల్లిని రోడ్డున పడేసిన తనయులు.. దిక్కులేక బస్టాండ్‌లో..

కన్నతల్లే కొడుకులకు భారమైంది. నవమాసాలు మోసి,కని, పెంచి పెద్ద చేసిన అమ్మప్రేమనే మరిచిపోయారు. వృద్ధాప్యంలో తోడుగా నిలవాల్సిన తనయులే తల్లిని రోడ్డున పడేశారు. కన్నపేగు ఆధరణ కరవై..అందరు ఉన్నా అనాథలా మారిపోయింది ఆ తల్లి. కన్నతల్లికి పట్టెడు అన్నం పెట్టలేని కర్కశత్వాన్ని ప్రదర్శించారు. దీంతో దిక్కులేని స్థితిలో ఆ వృద్ధురాలు బస్టాండ్‌ లో తలదాచుకుంటుంది. ఈ హృదయ విచారకర ఘటన తూర్పు గోదావరి జిల్లా ఆమాలపురంలో చోటు చేసుకుంది.

రాజానగరం మండలానికి చెందిన పార్వతమ్మకు నలుగురు కొడుకులు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. భర్త చనిపోవడం..కొడుకుల ఆదరణ కరవు కావడంతో ఇన్ని రోజులు కూతురి దగ్గరే ఉంటుంది. ఐతే తల్లిని చేరదీసిన కూతురు కూడా రెండేళ్ల క్రితం మృతి చెందింది. దీంతో నిన్నటి వరకు అక్కడా ఇక్కడ పని చేసుకుంటు పూట వెళ్లదీసుకున్న పార్వతమ్మ చేతకాకపోవడంతో కొడుకుల వద్దకు వెళ్లింది. కొడుకులేమో ఆస్తి పంచాలని తల్లిని వేధింపులు గురి చేస్తున్నారు. కొడుకులు సరిగా చూడకపోవడంతో.. రోడ్డున పడ్డ వృద్ధురాలు దిక్కులేక అమలాపురం బస్టాండ్‌ లో ఉంటుంది. ఎక్కడికి వెళ్లాలో తెలియక..చేతిలో చిల్లిగవ్వలేక బస్టాండ్‌లోనే బతుకీడుస్తుంది.

వృద్ధురాలు పార్వతమ్మ గత కొద్దిరోజులుగా అమలాపురంలో బస్టాండ్‌లోనే ఉంటుంది. వృద్ధురాలి అవస్థలను గమనించిన ప్రైవేట్ కళాశాల విద్యార్ధులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానికంగా ఉన్న కామాక్షి ఆశ్రమానికి వృద్ధురాలిని తీసుకెళ్లారు. అక్కడి స్వామిజీ పార్వతమ్మకు ఆశ్రయం కల్పించారు.