దేవుడా.. ఎలా రావాలి బయటకి.. ఇరకాటంలో పడ్డ పాము

యూఎస్‌లోని అరిజోనాలో ఓ రాటిల్ స్నేక్ జనావాసాల్లోకి వచ్చింది. అక్కడ ఓ డబ్బాలోని మూతలో చిక్కుకుపోయింది. ఉదయం నుంచి ఆహారం ఏదీ దొరకలేదు. నా మానాన నేను ఏదైనా దొరుకుతుందేమో తిందామని వెళుతున్నాను. ఇంతలో అక్కడ ఓ మూత కనిపించే సరికి ఏదో అనుకుని అందులో తల పెట్టాను. తియ్యబోతే ఎంతకీ రావట్లేదు. నా కళ్ల ముందు నేను తినాలనుకుంటున్న జీవులు వెళుతున్నా తినలేని పరిస్థితి. ఇదెక్కడి గొడవ. అయినా నేనుందుకు మా ఇల్లు అడవిలో ఉంటే దాన్ని కాదనుకుని సిటీకి వచ్చాను చూడండి. నాది బుద్ది తక్కువ.

ఏం మనుషులో వీళ్లు. ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు. మాలాంటి వాళ్లం ఎప్పుడైనా బోరు కొట్టి ఇటు వద్దామంటే వీల్లేదాయే. ఎక్కడ ఏం గుచ్చుకుంటుందో, ఎందులో ఇరుక్కుంటామో తెలియని పరిస్థితి. ఎంత ప్రయత్నించినా రాకపోయేసరికి నన్ను బయటకి తీయడానికి ఫియోనిక్స్ హెర్పెటోలాజికల్ సొసైటీ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నించారు. అయినా రావట్లేదని ఆయిల్ పూసి బయటకు తీసారు. పాపం నాకోసం చాలా కష్టపడ్డారు. ఆ తరువాత శుభ్రంగా సోపేసి రుద్ది స్నానం చేయించారు. అందుకే నేను వారిని ఏమీ చేయలేకపోయాను. మళ్లీ నన్ను తీసుకెళ్లి అడవిలో వదిలిపెట్టేసారు. అలా అని నేను ఎవర్నీ ఏమీ చేయకుండా ఉంటానని మాత్రం అనుకోకండి. ప్రపంచంలో అత్యంత విషపూరితమైన పాముని నేను. మరి రాటిల్ స్నేక్ అంటే ఏమనుకున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడిది వైరల్ అవుతోంది.