మార్కెట్లలో ఎందుకీ పతనం ?

రూపాయి రూపు కోల్పోతోంది. చమురు మంటలు మండుతోంది. చైనా – అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం తారాస్థాయికి చేరుతోంది. దేశీయంగా గణాంకాలు నిరుత్సాహపరుస్తున్నాయి. మొత్తానికి ఇవన్నీ కలిసి స్టాక్ మార్కెట్‌పై ఒత్తిడిని పెంచుతున్నాయి. దీంతో ఇంతకాలం నిఫ్టీ 12 వేల పాయింట్లకు చేరుతుందని ఆలోచించిన ఇన్వెస్టర్లు, ట్రేడర్లంతా తెగ ఆందోళనపడిపోతున్నారు. ఇప్పుడు ఉన్నట్టుండి వచ్చిన లిక్విడిటీ సమస్య మరింత టెన్షన్ పుట్టిస్తోంది. బాండ్ మార్కెట్లలో నగదు కొరత రాబోతోందని డిహెచ్ఎఫ్ఎల్ ఉదంతాన్ని బట్టి అర్థమవుతోంది. గతంలో దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ ఇచ్చిన బాండ్లను తక్కువ ధరకు డిఎస్‌పి మ్యూచువల్ ఫండ్ సంస్థ అమ్మేయడమే ఇందుకు అద్దం పడ్తోందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. తక్కువ ధరకు అమ్మినా పెద్దగా కొనుగోలుదార్లు లేకపోవడం వల్ల దివాన్ హౌసింగ్ షేర్లో అమ్మకాల ఒత్తిడికి ప్రధాన కారణమైంది. కొద్ది రోజుల క్రితం ఐఎల్ఎఫ్ఎస్ సంస్థ తాను ఇచ్చిన బాండ్లపై వడ్డీని చెల్లించలేక చేతులెత్తేయడం కూడా ఇందుకు కలిసొచ్చింది. ఈ రెండు సంఘటనలూ వెనువెంటనే జరగడంతో అటు ఎన్‌బిఎఫ్‌సి ఇటు హౌసింగ్ ఫైనాన్స్ సంస్థల స్టాక్స్ కుప్పకూలాయి. గతంలో ఎప్పడూలేని విధంగా దివాన్ హౌసింగ్ షేర్ ఒకే రోజు ఏకంగా 50 శాతం, ఇండియా బుల్స్ హౌసింగ్ 30 శాతం పతనమై ఇన్వెస్టర్లలో వణుకు పుట్టించాయి.

ఇదే సమయంలో రాబోయే రోజుల్లో లిక్విడిటీ సమస్య ఎదురవడంతో పాటు తక్కువ రేటుకు రుణం పుట్టకపోవచ్చనే అనుమానాలు ఎన్‌బిఎఫ్‌సి సంస్థలైన బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఎడిల్వైజ్, జెఎం ఫైనాన్స్ వంటి స్టాక్స్‌ను పడేశాయి. ఈ వినూత్నమైన పరిస్థితులను ఆకళింపు చేసుకునే లోపు సెన్సెక్స్ ఈ వారంలో సుమారు 1200 పాయింట్లు కోల్పోయింది. ఒక్క శుక్రవారం రోజునే వెయ్యి పాయింట్లు పడి సుమారు 750 పాయింట్ల వరకూ రికవర్ అయింది. దీంతో ఈ వారంలో 70కి పైగా స్టాక్స్ 52 వారాల కనిష్టానికి చేరాయి. మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఈ వారం ఏకంగా 3 శాతానికి పైగా పతనమైంది. రాబోయే రోజుల్లో రియాల్టీ రంగ స్టాక్స్‌‌లో కూడా  ఒత్తిడి ఉండొచ్చనేది ఇండస్ట్రీ ఆందోళన. రుణాలు పొందేందుకు నిధుల లభ్యత, వడ్డీ రేట్లు ఆధారంగా ఉన్న వివిధ రంగాలకు మరికొద్ది కాలం పాటు ఇలాంటి గడ్డు స్థితి కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో ఇన్వెస్టర్లు ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలనేదే ప్రధాన ప్రశ్న.

దీనికి తోడు రాబోయేది ఎన్నికల కాలం. అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు కూడా మెల్లిగా ఎగబాకుతున్నాయి. ఇంతకాలం అన్నీ కలిసొచ్చిన అంశాలే ఇప్పుడు విలన్‌గా మారాయి. అందుకే క్యాపిటల్‌ను కాపాడుకోవడం ఇప్పుడు చాలా ముఖ్యం. అలా అని ఆందోళనపడిపోయి నిరాశతో కుంగిపోవాల్సిన సమయమూ కాదు. డెట్ లేని కంపెనీలను ఎంచుకోవడం, ఎగుమతులపై ఆధారపడిన కంపెనీలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వడం, మంచి బ్రాండ్ ఉన్న సంస్థలను పట్టుకోవడమే మన ముందు ఉన్న లక్ష్యమనేది నిపుణుల సలహా.