మహాకూటమి ముందు టీజేఎస్‌ డిమాండ్లు

tjs chairmen kodandaram ask 30 seets for assembly elections

మహా కూట‌మి ఏర్పాటుకు ముందే తెలంగాణ జ‌న‌స‌మితి త‌న‌కేం కావాలో స్పష్టం చేసింది. త‌న డిమాండ్లను కూట‌మి పార్టీల ముందుంచింది. ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చడమే త‌మ లక్ష్యంగా చెబుతున్న టీజేఎస్ అన్ని వ‌ర్గాల వారికి న్యాయం చేస్తామంటేనే కూట‌మికి సై అంటామని తేల్చి చెప్పింది.

ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో తెలంగాణ జనసమితి దూకుడు మరింత పెంచింది. క్షేత్రస్థాయిలో పార్టీని బలపరిచే ప్రయత్నాలు చేస్తోంది. ప్రజా పోరాటాలే తమకు అండగా ఉంటాయని భావిస్తున్న టీజేఎస్‌.. మహాకూటమితో చర్చలు జరుపుతోంది. ఎజెండా కూడా సిద్ధం చేస్తోంది. అయితే, ఈ ఎజెండాకు ఓకే చెప్తేనే మహాకూటమితో ముందుకెళ్తామని కండిషన్‌ పెడుతోంది.

ఉద్యమంలో అమరులైన వారి పేరుతో స్మృతి వనం ఏర్పాటు, వారి కుటుంబాలకు గుర్తింపు, ఉద్యమకారుల కోసం ప్రత్యేక కమిషన్‌ ఏర్పాటు చేయాలన్నది టీజేఎస్‌ తొలి డిమాండ్‌. అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే ఎస్సీ, ఎస్టీ హ్యూమన్‌ రైట్స్‌ కమిషన్‌తోపాటు లోక్‌పాల్‌ చట్టాల బలోపేతం రెండో డిమాండ్‌ కాగా.. బీసీ సబ్‌ప్లాన్‌, గిరిజన ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ, అర్హులందరికీ పక్కా ఇళ్లు, క్షేత్రస్థాయిలో పనిచేసే వారికి వేతనాల పెంపు మూడో డిమాండ్‌. రైతులకు సంపూర్ణ రుణమాఫీ, విత్తు దశలోనే మద్దతు ధర, కౌలు రైతులకు రక్షణ, బలవంతపు భూసేకరణకు అడ్డుకట్ట, నిర్వాసితులకు న్యాయం, అలాగే అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపు లక్ష ఉద్యోగాల కల్పన, ఏటా నోటిఫికేషన్‌ క్యాలెండర్‌ ప్రకటన, పనులన్నీ స్థానికులకే ఇచ్చేలా చట్టం తేవాలని డిమండ్ చేస్తోంది. విద్యార్థులకు ఒకేసారి ఫీజు రీయింబర్స్‌మెంట్‌, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, ప్రతి జిల్లా కేంద్రంలో ఇంజినీరింగ్‌ కాలేజీ ఏర్పాటు, ఆరు నెలల్లో ఖాళీల భర్తీ.. 104, 108 సేవలు నిరంతరాయంగా కొనసాగించడం, ఆస్పత్రుల ఆధునీకరణ, మూతపడిన ప్రభుత్వ రంగ సంస్థల పునరుద్ధరణ, పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు, పాత పెన్షన్‌ విధానం అమలు లాంటి ఎన్నో డిమాండ్లను మహాకూటమి ముందు పెట్టింది. వీటికి ఓకే చెప్పడంతోపాటు కూటమి ఉమ్మడి ఎజెండాకు కోదండరామ్‌ను చైర్మన్‌ చేయాలని కండిషన్‌ పెట్టింది.

అయితే, టీజేఎస్‌ డిమాండ్లపై కాంగ్రెస్‌ సహా ఇతర పార్టీలు కూడా ఆచీతూచి స్పందిస్తున్నాయి. ఎజెండా సంగతి ఎలా ఉన్నా, దానికి చైర్మన్‌గా కోదండరామ్‌ నియామకంపైనే భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తంగా మహాకూటమికి ఆదిలోనే అవాంతరాలు ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది.